అల్లుడి వేధింపులు తాళలేకే ..
● పోలీసులకు సుష్మిత తల్లి లలిత వాంగ్మూలం
● భర్త యశ్వంత్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించిన పోలీసులు
మీర్‌పేట: సంచలనం సృష్టించిన ఆత్మహత్యల కేసులో భర్తను మీర్‌పేట పోలీసులు రిమాండ్‌కు తరలించిన సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం. ఈ నెల 8న హస్తినాపురం జయకృష్ణ ఎన్‌క్లేవ్‌లోని కుందనిక అపార్ట్‌మెంట్‌లో నివసించే సుష్మిత (27) తన 11 నెలల బాబు అశ్వంత్‌నందన్‌రెడ్డిని కడతేర్చి తాను ఆత్మహత్యకు పాల్పడగా, ఆమె తల్లి కూడా ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న సుష్మిత తల్లి లలిత పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. తన కూతురు ఆత్మహత్యకు అల్లుడు యశ్వంత్‌రెడ్డే కారణమని, వివాహమైన నాటి నుంచి వేధింపులు, వరకట్నం పేరుతో మానసికంగా ఇబ్బందులకు గురిచేసేవాడని తెలిపింది. దీంతో పాటు ప్రతి చిన్న విషయానికి గొడవ పడుతూ చిత్ర హింసలకు పాల్పడేవాడని, వేధింపులు తట్టుకోలేక తన కూతురు ఆత్మహత్య చేసుకుందని పేర్కొంది. మొదట లలిత నిద్రమాత్రలు దంచి వేసుకోగా, ఆ తరువాత సుష్మిత చిన్నారి బాబు ముక్కుమూసి ఊపిరాడకుండా చేసి అనంతరం ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. లలిత వాంగ్మూలం ఆధారంగా యశ్వంత్‌రెడ్డిని రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు.


