కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా..
స్థానికం
● వేణుగోపాలస్వామి ఆలయంలో
22 నుంచి వార్షికోత్సవాలు
● 25న స్వామివారి కల్యాణం
● బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరం
కడ్తాల్: కడ్తాల్ మండలం మఖ్తామాధారం గ్రామంలో కొలువైన, భక్తుల ఆరాధ్యదైవం వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాలు ఈ నెల 22వ తేది గురువారం నుంచి ప్రారంభమై 27వ తేది వరకు నిర్వహించనున్నారు. ఈ ఆలయంలో ఆరు రోజుల పాటు, భక్తజన సందోహం మధ్య వైభవంగా వేణుగోపాల స్వామికి ప్రత్యేక పూజలతో పాటు ఆయా కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఈ ప్రాంతంలో ఎంతో ప్రసిద్ధి చెంది, పురాతన ఆలయంగా వేణుగోపాల స్వామి ఆలయానికి గుర్తింపు ఉంది. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేస్తున్నారు. ప్రకృతి రమణీయ ప్రదేశంలో ఆలయం చూడచక్కగా ఉంటుంది. వేణుగోపాల స్వామి ఆలయాన్ని దర్శించుకున్న భక్తులు మంత్రముగ్దులవుతారు. భక్తుల కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా..జగత్‌రక్షకుడిగా వేణుగోపాల స్వామి ఆలయం ఈ ప్రాంతంలో ప్రత్యేక కీర్తి గడించింది. ఉత్సవాల కోసం ఈ ఆలయాన్ని సర్వాంగ సుందరంగా విద్యుత్ దీపాలతో, వివిధ రంగులు వేసి ఆలయాన్ని తీర్చిదిద్దుతున్నారు. బ్రహ్మోత్సవాల కోసం ఆలయాన్ని శోభాయామానంగా తీర్చిదిద్దుతున్నామని ఆలయ అనువంశిక అర్చక ధర్మకర్త తిరుమల వింజమూరు రామానుజాచార్యులు వివరించారు.
ఉత్సవ వివరాలు
● 22న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, స్వస్తివాచనం, ఋత్విగ్వరణం, రక్షాబంధనం, మృత్సంగ్రహణం, అంకురార్పణం
● 23న నిత్యవిధి, ఆదివాస హోమం, ద్వజారోహణం, బేరిపూజ దేవాతహ్వానం, పల్లకీ సేవ,
● 24న నిత్య విధి, హోమం అభిషేకం, గరుడవాహన సేవ, మోహినిసేవ
● 25న శ్రీవారి కల్యాణం. చంద్రప్రభసేవ, రథోత్సవం, అన్నదానం.
● 26వ తేదిన, గంధావళి ఉత్సవం, నిత్యవిధి, అభిసేకం, హోమం, శ్రీవారి అశ్వవాహన సేవ
● 27న నిత్యవిధి, మహా పూర్ణహూతి, చక్రస్నానం, ద్వజా అవరోహణం, దేవతా విసర్జనం, ద్వాద శారాధనం, పుష్పయాగం, సప్తవరణ మహాదాశీర్వాదం, సేవతో ఉత్సవాలు ముగుస్తాయి.
ఇలా చేరుకోవచ్చు
ప్రతి ఏటా జరిగే వార్షిక బ్రహ్మోత్సవాలకు హైదరాబాద్‌తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఉత్సవాలకు తరలి వస్తుంటారు. హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు శ్రీశైలం హైదరాబాద్ జాతీయ రహదారి నుంచి 44 కిలో మీటర్ల మేర ప్రయాణించి కడ్తాల్ చేరుకోవాలి. అక్కడి నుంచి షాధ్‌నగర్ వెళ్లే రహదారి నుంచి కడ్తాల్ మీదుగా 7 కిలో మీటర్ల దూరం వరకు ప్రయాణించి మఖ్తామాధారం వేణుగోపాల స్వామి ఆలయానికి చేరుకోవచ్చు. హైదరాబాద్ శ్రీశైలం రూట్లో ప్రతి ఐదు నిమిషాలకు బస్సు సౌకర్యం కలదు.


