సాపాటు ఎటూ లేదు.! | - | Sakshi
Sakshi News home page

సాపాటు ఎటూ లేదు.!

Jan 19 2026 10:45 AM | Updated on Jan 19 2026 10:45 AM

సాపాటు ఎటూ లేదు.!

సాపాటు ఎటూ లేదు.!

శంషాబాద్‌: నిర్మాణ రంగంతో పాటు అనే సంస్థలు, పరిశ్రమల్లో లేబర్‌ పనులు చేసుకునే అడ్డాకూలీలు, ప్రయాణికులు, బాటసారులు శంషాబాద్‌ సర్కిల్‌లో వేల సంఖ్యలో ఉంటారు. కానీ ఇక్కడ ఇప్పటి వరకు ఇందిరమ్మ క్యాంటీన్‌ రూ.5 భోజన కేంద్రం లేదు. దీంతో పనులు లభించని వేళ కూలీలు పస్తులుండాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇక్కడ రూ.5 భోజన కేంద్రం లేకపోవడానికి కారణం ఇది మున్సిపాలిటీ కావడమే. శంషాబాద్‌ మున్సిపాలిటీ ఏర్పాటై ఆరేళ్లయ్యింది. ఈ ప్రాంతంలో కూలీలు ఎక్కువగా ఉండటంతో స్వచ్ఛంద సంస్థలు ఇక్కడ రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తామని ముందుకొచ్చాయి. కానీ మున్సిపాలిటీ వద్ద బడ్జెట్‌ లేక అధికారులు వెనకడుగు వేశారు. దీంతో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క రూ.5 భోజన కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు.

● శంషాబాద్‌ మున్సిపాలిటీ జీహెచ్‌ఎంసీలోకి విలీనమైన విషయం విదితమే. జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్నట్లే ఇప్పుడు ఇక్కడ కూడా రూ.5 భోజన కేంద్రాలు ఏర్పాటు చేస్తారా? అని స్థానిక నేతలను.. కార్మిక సంఘాల నాయకులను ఆశగా అడుగుతూ కూలీలు కనిపిస్తున్నారు. శంషాబాద్‌ జీహెచ్‌ఎంసీలో విలీనమైన నేపథ్యంలో రూ.5 భోజన కేంద్రాలు ఎప్పుడెప్పుడు ఏర్పాటు చేస్తారోనని కూలీలు, పేదలు వేయి కళ్లతో వినిపించని ఆకలి ఆర్తనాదాలతో ఆశగా ఎదురుచూస్తున్నారు.

వేల సంఖ్యలో

శంషాబాద్‌ సర్కిల్‌లోని శంషాబాద్‌, కొత్వాల్‌గూడ డివిజన్ల పరిధిలో నిర్మాణ రంగాలతో పాటు పరిశ్రమలు, వివిధ సంస్థల్లో పనిచేసే కార్మికులు వేల సంఖ్యలో ఉంటారు. వీరితో పాటు ప్రయాణికులు, బాటసారులు అనేక మంది రాకపోకలు సాగిస్తుంటారు. సర్కిల్‌లో రూ. భోజన కేంద్రం ఏర్పాటు చేయాలని ఐదేళ్లుగా కార్మికులతో పాటు వాటి సంఘాల నేతలు డిమాండ్‌ చేయడంతో పాటు మున్సిపాలిటీలో వినతి పత్రాలు సమర్పిస్తున్నారు. అయితే స్వచ్ఛంద సంస్థ నిర్వహణలో ఉండే ఈ కేంద్రానికి సంబంధించిన బడ్జెట్‌లో సగానికి పైగా స్థానిక సంస్థలే భరించాల్సి ఉండటంతో బడ్జెట్‌ భారం అనుకున్న అధికారులు, నేతలు దానిని పక్కన పెట్టేశారు.

ఇప్పుడు సాధ్యమేగా

ప్రస్తుతం శంషాబాద్‌ జీహెచ్‌ఎంసీలో విలీనమై నెలరోజులు కావస్తోంది. జీహెచ్‌ఎంసీలో పదుల సంఖ్యలో కొనసాగుతున్న మాదిరిగానే శంషాబాద్‌లో లేబర్‌ అడ్డాలున్న చోట్ల వీటిని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ వెల్లువెత్తుతోంది. ప్రస్తుతం వీటి ఏర్పాటుకు బడ్జెట్‌ కూడా భారం కాకపోవడంతో త్వరగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రూ.5భోజన కేంద్రంతో వందల సంఖ్యలో డబ్బులు లేని వారు కడుపు నింపుకుంటారని దీనిపై అధికారులు సత్వరమే స్పందించాలనికోరుతున్నారు. దీనిపై స్థానికంగా సీపీఐ నాయకులు ఇప్పటికే అధికారులకు వినతి పత్రాలు అందజేశారు.

శంషాబాద్‌లో వందల సంఖ్యలో అడ్డా కూలీలు

పనులు దొరకకపోతే

పస్తులు ఉండాల్సిన పరిస్థితి

గతంలో మున్సిపాలిటీగా ఉండటంతో రూ.5 భోజన కేంద్రం ఏర్పాటుకు వెనకడుగు

బడ్జెట్‌ లేకనే ఏర్పాటు

చేయలేకపోయామన్న అధికారులు

జీహెచ్‌ఎంసీలోకి విలీనమైన నేపథ్యంలో ఏర్పాటు చేస్తారని చిగురిస్తున్న ఆశలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement