శాంతి ర్యాలీ భగ్నం
సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటుకు డిమాండ్
బన్సీలాల్‌పేట్: సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ శనివారం చేపట్టిన శాంతి ర్యాలీని పోలీసులు భగ్నం చేశారు. ఆందోళ నకు దిగిన బీఆర్‌ఎస్, లష్కర్ జిల్లా సాధన సమితి నాయకులు, ఇతరత్రా అసోసియేషన్‌ల ప్రతినిధులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ నేపథ్యంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ సాధన డిమాండ్‌తో మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో సనత్‌నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ తదితర ప్రాంతాల నుంచి బీఆర్‌ఎస్ కార్యకర్తలు, నాయకులు వివిధ వ్యాపార, వాణిజ్య సంఘాల ప్రతినిధులు ఉదయం అల్ఫా హోటల్ ప్రాంతానికి తరలివ చ్చారు. రైల్వేస్టేషన్ నుంచి క్లాక్‌టవర్, ప్యాట్నీ చౌరస్తా, ప్యారడైజ్ నుంచి ఎంజీ రోడ్డులోని మహాత్మాగాంధీ విగ్రహం వరకు శాంతి ర్యాలీ చేసేందుకు యత్నించారు. అప్పటికే భారీ సంఖ్యలో మోహరించిన పోలీసులు.. బీఆర్‌ఎస్ కార్పొరేటర్లు, నాయకు లను అరెస్టు చేసి ఠాణాలకు తరలించారు. దీంతో సికింద్రాబాద్ అల్ఫా హోటల్ ముందు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పెద్ద ఎత్తున పోలీసుల మోహరింపు.. ఆందోళనకారుల నినాదాలతో ఈ ప్రాంతం హోరెత్తింది. లష్కర్ జిల్లా సాధన సమితి, బీఆర్‌ఎస్ పిలుపు మేరకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పరిసరాలు, మోండా మార్కెట్, సుభాష్ రోడ్డు తదితర ప్రాంతాల్లో వ్యాపార సంస్థలు పాక్షికంగా బంద్ పాటించాయి. అనంతరం వ్యాపార కార్యకలాపాలను యథావిధిగా కొనసాగించాయి.
అరెస్టులు.. నిర్బంధాలు
నల్ల కండువాలు, బ్యాడ్జీలతో చేపట్టిన శాంతి ర్యాలీలో పాల్గొనేందుకు వచ్చిన లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ గౌడ్, తలసాని సాయికిరణ్ యాదవ్, తలసాని స్కైలాబ్ యాదవ్, మోండా మార్కెట్ చిల్లర వర్తకుల సంఘం ప్రధాన కార్యదర్శి కోత్‌మీర్ మధు, ఆకుల హరికృష్ణ తదితరులను పోలీసులు అరెస్టు చేసి రాంగోపాల్‌పేట్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి.పద్మారావు గౌడ్‌ను మోండా మార్కెట్ టకార బస్తీలోని ఆయన నివాసంలో హౌస్ అరెస్టు చేశారు. కాగా.. ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్‌ను, కార్పొరేటర్లను, వ్యాపార వర్గాల ప్రతినిధులను ఎక్కడికక్కడ అడ్డుకున్నారు.
శాంతి ర్యాలీని అడ్డుకోవడం సరికాదు: ఎమ్మెల్యే పద్మారావు
సికింద్రాబాద్ ప్రాంత అస్తిత్వాన్ని ఇక్కడి ప్రజల ఆత్మగౌరవం కోసం చేపట్టిన శాంతి ర్యాలీని అడ్డుకోవడం సరికాదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే టి. పద్మారావు గౌడ్ అన్నారు. మోండా మార్కెట్ టకారబస్తీలోని తన నివాసం వద్ద విలేకరులతో ఆయన మాట్లాడారు. ప్రజాభిప్రాయానికి అను గుణంగా నిర్ణయం తీసుకుంటామని అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ప్రభుత్వం ఆచరణలో విఫలమైందన్నారు. లష్కర్ జిల్లా సాధన సమితి అధ్యక్షుడు జి.పవన్‌కుమార్ గౌడ్ మాట్లాడుతూ.. సికింద్రాబాద్ కార్పొరేషన్ ఏర్పాటు చేసే వరకు పోరాటాన్ని ఆపేదిలేదన్నారు. సికింద్రాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని ఎస్సీఆర్పీ రాష్ట్ర అధ్యక్షుడు డి.సుదర్శన్‌బాబు డిమాండ్ చేశారు.
ర్యాలీకి అనుమతి లేదంటూ నాయకుల అరెస్టు
భారీగా మోహరించిన పోలీసులు.. ఉద్రిక్తత
శాంతి ర్యాలీ భగ్నం


