పైగా పాలెస్
స్వర్ణ జయంతి
మార్చి నాటికి హెచ్‌ఎండీఏ కార్యాలయం బదిలీ
● ప్యాలెస్ పునరుద్ధరణ పనులు వేగవంతం
● అన్ని విభాగాలు ఒకేచోట ఉండేలా చర్యలు
టు
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) కార్యాలయం అమీర్‌పేట్ లోని స్వర్ణజయంతి కాంప్లెక్స్ నుంచి త్వరలో బేగంపేట్‌లోని పైగా ప్యాలెస్‌కు మారనుంది. ఈ మేరకు ఏర్పాట్లు వేగవంతమవుతున్నాయి. ప్రస్తుతం పైగా ప్యాలెస్‌లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నాయి. మార్చి నాటికి అన్ని ప్రభుత్వ కార్యాలయాలు అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత భవనాల్లోకి మారాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో స్వర్ణజయంతి కాంప్లెక్స్‌ను మరేదైనా ప్రభుత్వ విభాగానికి కేటాయించేలా పూర్వ హుడా భవనమైన పైగా ప్యాలెస్‌కు హెచ్‌ఎండీఏను బదిలీ చేయనున్నారు. దీని అన్ని విభాగాలు ఒకేచోట కొలువుదీరేందుకు అవకాశం ఏర్పడనుంది. పైగా ప్యాలెస్ లోని 4, 5వ అంతస్తులను అదనంగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం హెచ్‌ఎండీఏ ప్రధాన కార్యాలయం స్వర్ణజయంతిలో ఉండగా, డైరెక్టర్ అర్బన్ ఫారెస్ట్, ఓఆర్‌ఆర్ కార్యాలయాలు నానక్‌రాంగూడలోని హెచ్‌జీసీఎల్ ఉన్నాయి. బుద్ధపూర్ణి మ ప్రాజెక్టు కార్యాలయం ట్యాంక్‌బండ్ సమీపంలో ఉంది. ఈ మూడు విభాగాల కార్యకలాపాలను పైగా ప్యాలెస్‌లోనే నిర్వహించే దిశగా చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.
హెచ్‌ఎండీఏకు పూర్వ వైభవం
వందల ఏళ్లనాటి చారిత్రక సౌధమైన పైగా ప్యాలెస్ 2008 వరకు హెచ్‌ఎండీఏ కార్యాలయంగానే కొనసాగింది. అప్పటి ప్రభుత్వ నిర్ణయం మేరకు ఆ భవనాన్ని అదే ఏడాది అక్టోబర్‌లో అమెరికన్ కాన్సులేట్‌కు కేటాయించారు. 2023 మార్చిలో అమెరికన్ కాన్సులేట్‌ను నానక్‌రాంగూడలోని సొంత భవనంలోకి తరలించారు. అప్పటి నుంచి పైగా ప్యాలెస్ నిరుపయోగంగానే ఉంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పైగా ప్యాలెస్‌ను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రతిపాదించినా.. ఆచరణలో మాత్రం ముందుకు సాగలేదు. చివరకు హెచ్‌ఎండీఏ కార్యాలయాన్ని అక్కడే పునరుద్ధరించాలని నిర్ణయించారు. ఏడాది క్రితమే ఈ నిర్ణయం తీసుకున్నప్పటికీ పునరుద్ధరణ పనులు ముందుకు సాగలేదు. ఇటీవల అన్ని ప్రభుత్వ కార్యాలయాలు తప్పనిసరిగా అద్దె భవనాలను ఖాళీ చేసి సొంత భవనాల్లోకి మారాలని ప్రభుత్వం నిర్ణయం తీసు కోవడంతో పనులు వేగవంతం చేసినట్లు అధికారులు తెలిపారు.
ఆకట్టుకునే ఇండో– యూరోపియన్ నిర్మాణ శైలి
ఆరో నిజాం మీర్ మహబూబ్ అలీఖాన్ వద్ద ప్రధానిగా పని చేసిన నవాబ్ వికారుల్ ఉమ్రా బేగంపేట లోని రెండున్నర ఎకరాల విస్తీర్ణంలో ఇండో – యూరోపియన్ శైలిలో పైగా ప్యాలెస్‌ను నిర్మించారు. నవాబ్ కోరిక మేరకు ఆయనకు దీనిని బహుమతిగా ఇచ్చారు. హైదరాబాద్ సంస్థానం విలీనం అనంతరం ఇది రాష్ట్ర ప్రభుత్వ వారసత్వ సంపదగా మారింది. సుమారు 1981 నుంచి 2008 వరకు అంటే అమెరికా కాన్సులేట్ ఏర్పాటు వరకు ఈ భవనంలోనే హెచ్‌ఎండీఏ కార్యాలయం ఉండేది. తర్వాత 14 ఏళ్ల పాటు అమెకన్ కాన్సులేట్ కార్యాలయంగా కొనసాగింది. తాజాగా మరోసారి హెచ్‌ఎండీఏ కార్యాలయంగా పూర్వవైభవాన్ని సంతరించుకోనుంది.
పైగా పాలెస్


