కాంగ్రెస్ ఇక పల్లెబాట
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ‘వీబీ జీ రామ్‌జీ చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని, మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 20 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘పల్లెబాట’ పట్టనున్నట్లు జిల్లా కాంగ్రెస్ కమిటీ ప్రకటించింది. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన చట్టంతో నిరుద్యోగ సమస్య పెరగడం, కూలీలపై నిర్భందం, శ్రమ దోపిడీకి గురవడం, మహిళలు ఉపాధి అవకాశాలను కోల్పోవడంతో పాటు పట్టణాలకు మళ్లీ వలసలు పెరిగే ప్రమాదం ఉందని.. దళిత, ఆదివాసీ కుటుంబాలకు తీవ్ర నష్టాలను తెచ్చిపెట్టే చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, రాష్ట్ర రోడ్స్ అండ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ బొర్రా జ్ఞానేశ్వర్, టీపీసీసీ జనరల్ సెక్రటరీ జంగారెడ్డి, రాష్ట్ర స్పోక్స్ పర్సన్ గౌరీ సతీష్, జెడ్పీ మాజీ చైర్‌పర్సన్ తీగల అనితారెడ్డి, శంషాబాద్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షుడు సంజయ్ యాదవ్, నర్కుడ గ్రామ సర్పంచ్ శేఖర్ యాదవ్‌తో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా చల్లా నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. బీజేపీ ప్రభుత్వం పేదల ఉపాధి హక్కును కాలరాస్తోందని ఆరోపించారు. మన్మోహన్‌సింగ్ ప్రభుత్వం పేదలకు 100 రోజుల పని కల్పించి, వలసలను నివారించేందుకు మహాత్మాగాంధీ పేరున జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టారని, వందశాతం నిధులను కేంద్రమే చెల్లించేదని గుర్తు చేశారు.
కాంగ్రెస్‌కు పేరు వస్తుందనే..
ఈ పథకంతో కాంగ్రెస్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో అనే భయంతో మోదీ ప్రభుత్వం గాంధీ పేరును తొలగించి, గాడ్సే వారసుల పేరుతో చట్టాన్ని తీసుకొచ్చారని దుయ్యబట్టారు. కూలీల పని దినాలకు 60 శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్రం చెల్లించాలని మెలిక పెట్టి పథకాన్ని పేదలకు దూరం చేసే కుట్ర చేస్తున్నారని విమర్శించారు. పేద కూలీల విషయంలో కేంద్రం అనుసరిస్తున్న వైఖరిని నిరసిస్తూ వరుసగా పది రోజుల పాటు పార్టీ కేడర్ అంతా గ్రామాల్లో పర్యటించి, ఉపాధి హామీ పథకంలో పేరు మార్పుతో పేదలకు జరగనున్న నష్టాలను వివరించనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్యేలు మొదలుకార్పొరేషన్ల చైర్మన్లు, సర్పంచులు, జెడ్పీటీసీ మాజీ సభ్యు లు, ఎంపీటీసీ మాజీ సభ్యులు, ఎంపీపీలు, ముఖ్య నేతలంతా ఈ పది రోజులు జనం మధ్యే ఉండాలని పిలు పునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా ఇంటింటికీ కరపత్రాలు పంపిణీ చేసి కేంద్రం వైఖరిని ఎండగట్టాలన్నారు. వీబీజీ రామ్‌జీ చట్టం రద్దు కోసం ప్రజలందరినీ సంఘటితం చేసి కేంద్రంపై ఒత్తిడి తీసుకురాన్నుట్లు ఆయన ప్రకటించారు.


