‘విలీనం’.. శాపం!
నిర్మాణ అనుమతులదీ అదే పరిస్థితి సతాయిస్తున్న సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ రోజుల తరబడి కాలయాపన ఇబ్బందులు పడుతున్న ప్రజలు
తుర్కయంజాల్: గ్రేటర్‌లో విలీనం చేయక ముందు సీడీఎంఏకు సంబంధించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సాఫ్ట్‌వేర్ ద్వారా ఇంటి నంబర్‌కు ఆన్‌లైన్‌లో అప్లికేషన్ చేసేవారు. అధికారుల పరిశీలన అనంతరం ప్రాపర్టీ ట్యాక్స్ ఐడెంటిఫికేషన్ నంబర్ జారీ అయ్యేది. విలీనం నుంచి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌కు సాఫ్ట్‌వేర్‌లో దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారు. కేవలం పాత పీటీఐఎన్ నంబర్‌లు ఉండి, అసెస్‌మెంట్ పూర్తయిన వారికి మాత్రమే పన్నులు చెల్లించడానికి వీలు కుదురుతుంది. కొత్తగా దరఖాస్తు చేసుకునే సాఫ్ట్‌వేర్ అప్లికేషన్‌ను కేటాయించకపోవడంతో అసెస్‌మెంట్ కోసం దరఖాస్తు చేయాలనుకునే వారు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ విషయమై మున్సిపల్ రెవెన్యూ శాఖ అధికారులకు సైతం స్పష్టత లేదు. ఎప్పటి వరకు ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందో చెప్పలేకపోతున్నారు.
వేధిస్తున్న టెక్నికల్ సమస్యలు
ఇంటి నిర్మాణ అనుమతులు జారీ చేసే బిల్డ్ నౌ సాఫ్ట్‌వేర్‌లో దొర్లిన తప్పులను సరిదిద్దే విషయంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. అబ్దు ల్లాపూర్‌మెట్ మండలం ఆదిబట్ల సర్కిల్‌లోని గ్రా మాలను ఇబ్రహీంపట్నం మండలంలో చేర్చారు. దీనిపై పలువురు దరఖాస్తుదారులు, టౌన్ ప్లానింగ్ అధికారులు వరుసగా ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదు. జీహెచ్‌ఎంసీ అధికారులు ఇబ్రహీంపట్నం మండలంలోనే చేర్చాలని చెప్పారని, వారి సూచన మేరకే ఇలా చేశామని చెప్పుకొస్తున్నారు. ఉన్నతాధికారుల నుంచి ఈ సమస్యను పరిష్కరించాలని ఆదేశాలు వస్తేనే చేస్తామని అప్పటి వరకు ఇంతేనని చెబుతుండటం గమనార్హం. ఈ ఒక్క సర్కిల్‌లోనే కాదు విలీన మున్సిపాలిటీల్లో అనేక టెక్నికల్ సమస్యలు ఉన్నాయి. సులువుగా పరిష్కా రమయ్యే వాటిని కూడా చేయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి బిల్డ్ నౌలో నెలకొన్న సమస్యలను పరిష్కరించడంతో పాటు పీటీఐఎన్ నంబర్‌ల జారీ ప్రక్రియను ప్రారంభించాలని కోరుతున్నారు.
విలీన మున్సిపాలిటీల్లో నిలిచిన ఇంటి నంబర్లజారీ
మున్సిపాలిటీలను గ్రేటర్‌లో విలీనం చేసి 45 రోజులు పూర్తవుతున్నా నేటికీ పాలన చక్కబడలేదు. ఇళ్ల నిర్మాణ అనుమతుల నుంచి మొదలు ఇంటి నంబర్ల జారీ, మ్యూటేషన్, బర్త్, డెత్ సర్టిఫికెట్, వెకెంట్ ల్యాండ్ ట్యాక్సీ, ట్రేడ్ లైసెన్స్‌ల కోసం ప్రజలు రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
వేచి చూడాల్సిందే..
గ్రేటర్‌లో విలీనం నుంచి కొత్త అసెస్‌మెంట్‌ల ప్రక్రియ పూర్తిగా నిలిచిన మాట వాస్తవమే. గతంలో మున్సిపాలిటీల నుంచి పీటీఐఎన్ నంబర్‌లు పొందిన వారు మాత్రమే పన్నులు చెల్లించవచ్చు. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ కారణంగా కొత్త దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాలేదు. ఇది పూర్తయ్యే వరకు వేచి చూడాల్సిందే.
– శ్రీనివాసులు, రెవెన్యూ అధికారి, ఆదిబట్ల సర్కిల్


