తాళం వేసిన ఇంట్లో చోరీ
రూ.2.20 లక్షల అపహరణ
కేశంపేట: తాళం వేసి పండుగకు ఊరెళ్లిన వారి ఇంట్లో దొంగలు పడి నగదు దోచుకెళ్లిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసులు, బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బైకని శ్రీశైలం డ్రైవింగ్ చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నారు. ఇటీవల ఇంటి నిర్మాణం చేపట్టి అందుకు అవసరమైన నగదును తెలిసిన వ్యక్తుల వద్ద అప్పుగా తెచ్చి పెట్టారు. అందులో నుంచి కొంత నగదు ఇంటి నిర్మాణానికి ఉపయోగించగా మిగిలిన రూ.2.20 లక్షలను ఇంట్లో బీరువాలో భద్రపరిచారు. ఈ నెల 12న డ్రైవింగ్‌లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీశైలం వెళ్లగా అదే రోజు సాయంత్రం అతడి భార్య నిర్మల తన తల్లిగారి ఊరైన ఘనపురానికి వెళ్లారు. అయితే ఇంటి వెనుకవైపు నుంచి గుర్తుతెలియని వ్యక్తి ప్రవేశించి బీరువా తెరిచి అందులో ఉన్న నగదును దొంగిలించారు. సంక్రాంతి పండుగ తర్వాత నిర్మల శుక్రవారం సాయంత్రం ఇంటికి వచ్చారు. బీరువాలో ఉన్న నగదు లేకపోవడంతో భర్తకు విషయాన్నిన తెలియజేశారు. దీంతో శ్రీశైలం శనివారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకోని దర్యాప్తు జరుపుతున్నట్టు సీఐ నరహరి తెలిపారు.
అనుమానాస్పదంగా వ్యక్తి మృతి
మర్పల్లి: అనుమానాస్పదంగా ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన మండల పరిధి రావులపల్లి గ్రామంలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. మోమిన్‌పేట్ మండలం కాస్లాబాద్ గ్రామానికి చెందిన గొల్ల రమేష్ జీవనోపాధి నిమిత్తం 10 సంవత్సరాల క్రితం రావులపల్లికి వచ్చారు. గ్రామంలోని ఓ వెంచర్‌లో పనిచేస్తుండేవాడు. శుక్రవారం సాయంత్రం వెంచర్‌లో మిత్రులతో డిన్నర్ ఉందని రమేష్ ఇంట్లో కుటుంబీకులకు చెప్పి వెళ్లాడు. రాత్రి 10 గంటలు అయినా ఇంటికి రాకపోవటంతో కంగారు పడిని కుటుంబీకులు.. అతనికి ఫోన్ చేయగా.. స్విచ్ఛాఫ్ వచ్చింది. ఇదే విషయమై మృతుడి మిత్రులను ప్రశ్నించగా.. పొంతనలేని సమాధానం చెప్పారు. దీంతో అతని ఆచూకీ కోసం వెతకగా.. రావులపల్లి సమీపంలోని కుటుగుంట రోడ్డు పక్కన విగతజీవిగా పడున్నాడు. పోలీసులకు సమాచారం ఇవ్వగా.. ఎస్‌ఐ రహూఫ్ ఘటన స్థలికి చేరుకున్నారు. వివరాలు సేకరించి, పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని మర్పల్లి ఆస్పత్రికి తరలించారు. అనంతరం దేహాన్ని బంధువులకు అప్పగించారు. తన భర్త చావుకు అతని ముగ్గురు స్నేహితులే కారణమంటూ మృతుడి భార్య అనుసూజ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు అనుమానస్పద కేసుగా నమోదుచేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మృతుడికి కూతురు, కుమారుడు ఉన్నారు.
చీమల్‌దరే ఆదర్శం
మోమిన్‌పేట: సుపరిపాలనలో జాతీయ అవా ర్డు పొందిన చీమల్‌దరి గ్రామాన్ని ఆదర్శంగా తీసుకుంటామని గోవా రాష్ట్ర సర్పంచుల బృందం తెలిపింది. శనివారం గ్రామంలో వారితోపాటు ఎన్‌ఐఆర్‌డీ బృందం సభ్యులు పర్యటించారు. ఈ సందర్భంగా పల్లె ప్రకృతి వనం, రో డ్లు, భూగర్భ మురుగు కాల్వల నిర్మాణం, ప్రజలకు పంచాయతీ నుంచి అందుతున్న సేవలు, పన్నుల వసూలు, వీధి దీపాల ఏర్పాటు తదితర వాటిని తెలుసుకున్నారు. మారుమూల గ్రామం ఇంతలా అభివృద్ధి చెందడం, అందుకు గ్రామస్థుల సహకారం, సర్పంచ్ పని తీరును వారు కొనియాడారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ కల్పన, ఎన్‌ఐఆర్‌డీ అధికారి విద్యులత, గోవా రాష్ట్ర ఎస్‌ఐఆర్‌డీ అధికారి లక్ష్మీకాంత్, ఎంపీడీఓ సృజన సాహిత్య, ఎంపీఓ యాదగిరి, ఉప సర్పంచ్ రాంచంద్రయ్య, కార్యదర్శి భరత్ తదితరులు పాల్గొన్నారు.
విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
గోల్కొండ: విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని టోలిచౌకీ ఏసీపీ సయ్యద్ ఫయాజ్ అన్నారు. శనివారం గోల్కొండలోని లిటిల్స్ ప్యారడైస్ స్కూల్‌లో పాఠశాల వార్షికోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ..చెడు వ్యసనాలకు వ్యతిరేకంగా పోలీసులు చేపడుతున్న కార్యక్రమాలకు ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్నారు. డ్రగ్స్ రహిత నగర నిర్మాణానికి ప్రభుత్వ ఆదేశాలతో పోలీసు యంత్రాంగం పటిష్ట ప్రణాళికతో కృషి చేస్తుందన్నారు. ఇందులో భాగంగానే పాఠశాలలు, కళాశాలల్లో డ్రగ్స్ సేవనం వల్ల తలెత్తే దుష్పరిణామాలు తదితర విషయాలపై అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈ విషయంలో పాఠశాలల కరస్పాండెంట్లు, పోలీసులకు బాగా సహరిస్తున్నారన్నారు. అనంతరం ఆయన చెడు వ్యసనాలకు దూరంగా ఉంటామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో పాఠశాల కరస్పాడెంట్ సయ్యద్ యూనుస్, అధ్యాపక బృందం ఉన్నారు.
తాళం వేసిన ఇంట్లో చోరీ
తాళం వేసిన ఇంట్లో చోరీ


