26లో.. దక్కింది ఐదే!
మొయినాబాద్: మున్సిపాలిటీ ఎన్నికల రిజర్వేషన్లలో బీసీలకు రిక్త హస్తం చూపించారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీలకు 31 శాతం రిజర్వేషన్లు కేటాయించినట్లు ప్రభుత్వం చెబుతుంటే.. మొయినాబాద్ మున్సిపాలిటీలో మాత్రం బీసీలకు దక్కింది కేవలం 19 శాతం మాత్రమే. మున్సిపాలిటీలో మొత్తం 26 స్థానాలుండగా కేవలం 5 స్థానాలు మాత్రమే బీసీలకు రిజర్వు అయ్యాయి. అందులోనూ బీసీ మహిళలకు 2 స్థానాలు, బీసీ జనరల్‌కు 3 స్థానాలు కేటాయించారు. జనాభా పరంగా చూసినా, ఓటర్ల పరంగా చూసినా మొయినాబాద్ మున్సిపాలిటీలో బీసీలు 56 శాతానికి పైగానే ఉన్నారు. మున్సిపాలిటీ రిజర్వేషన్లలో మాత్రం కేవలం 19 శాతం మాత్రమే కేటాయించడం చర్చనీయాంశంగా మారింది. దీనిపై బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
చైర్మన్ పదవిపై ఎమ్మెల్యే తనయుడి గురి?
మొయినాబాద్ మున్సిపల్ చైర్మన్ స్థానం ఎస్సీ జనరల్‌కు రిజర్వు కావడంతో ఆ పదవిపై స్థానిక ఎమ్మెల్యే తనయుడు గురిపెట్టినట్లు తెలుస్తోంది. ఇప్పటికే మొయినాబాద్ జెడ్పీటీసీగా పనిచేసిన ఎమ్మెల్యే కాలె యాదయ్య తనయుడు కాలె శ్రీకాంత్ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమైనట్లు ప్రచారం జరుగుతుంది. ఎస్సీ జనరల్‌కు రిజర్వు అయిన 11వ వార్డు నుంచి ఆయన పోటీ చేసే అవకాశం ఉన్నట్లు సమాచారం. అందుకు తగిన ఏర్పాట్లను ఆయన అంతర్గతంగా చేస్తున్నట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. 11వ వార్డులో విజయం సాధించి చైర్మన్ పదవిని దక్కించుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తుంది. దీనిపై క్లారిటీ రావాలంటే మాత్రం కొంత కాలం వేచిచూడాల్సిందే.
మొయినాబాద్ మున్సిపల్‌లో బీసీలకు 19 శాతమే
ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీసీ సంఘాలు
తీవ్ర నిరాశలో పలు పార్టీల ఆశావహులు


