పట్టా భూములకు పరిహారం పెంచండి
దుద్యాల్: పారిశ్రామిక వాడ ఏర్పాటులో భాగంగా పట్టా భూములు కోల్పోతున్న తమకు పరిహారం పెంచి ఇవ్వాలని 11 మంది బాధిత రైతులు శనివారం వికారాబాద్‌లో కలెక్టర్ ప్రతీక్ జైన్ కలిసి విన్నవించారు. గత ఏడాది నవంబర్ 3న పట్టా భూముల సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. మండలంలోని పోలేపల్లి, హకీంపేట్, లగచర్ల గ్రామాల పరిధిలోకి వచ్చే 815, 816, 817 సర్వే నంబర్లలో 32 మంది రైతులకు సంబంధించిన 23.15 ఎకరాల పట్టా భూముల సేకరణకు నోటిఫికేషన్ ఇచ్చారు. 816, 817 సర్వే నంబర్లలో 13 ఎకరాలకు చెందిన రైతులు కలెక్టర్‌ను కలిశారు. తమది విలువైన భూమి అని పరిహారం పెంచి ఇవ్వాలని కోరారు. ధర పెంచి ఇస్తే ఇతర ప్రాంతాల్లో భూమి కొనుగోలు చేసి సాగు చేసుకుంటామని తెలిపారు. స్పందించిన కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం జరిగేలా చూస్తామని రైతులకు హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రైతులు మామిళ్ల నర్సింలు, సరిత, జయమ్మ, మాణేమ్మ, ప్రమీల తదితరులు పాల్గొన్నారు.


