క్రీడాకారుల ఔదార్యం
యాచారం: సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడా పోటీల్లో గెలుపొందిన నగదును కష్టాల్లో ఉన్నవారికి అందించి మంచి మనుసును చాటుకున్నారు క్రీడాకారులు. మండలంలోని మొండిగౌరెల్లి గ్రామానికి చెందిన గోడుకొండ్ల ప్రవీణ్‌కుమార్ మూడు నెలల కింద రోడ్డు ప్రమాదానికి గురై ఇంట్లో మంచానికే పరిమితమయ్యారు. జీవచ్చంలా పడి ఉన్న ప్రవీణ్‌కుమార్ చూసి చలించిన క్రీడాకారులు కుంటి పాండుయాదవ్ తదితరులు క్రికెట్ పోటీలో గెలుపొందిన రూ.ఐదు వేలను బాధితుడికి శనివారం అందజేశారు. అదే విధంగా కుర్మిద్ద గ్రామంలో వారం కింద వలబోతు నర్సింహ అనారోగ్యానికి గురై మృతి చెందారు. అదే గ్రామంలో క్రికెట్ పోటీలో గెలుపొందిన నరేష్, మహేందర్ తదితరులు బాధిత కుటుంబ సభ్యులకు రూ.ఐదు వేల ఆర్థికసాయం అందించి అండగా నిలిచారు. రెండు గ్రామాల్లోని క్రీడాకారులు తమ ప్రైజ్ మనీని కష్టాల్లో ఉన్నవారికి అందజేసి అండగా నిలవడంపై మండలవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.


