చైనామాంజా విక్రయిస్తున్న పలువురి అరెస్ట్
అంబర్‌పేట: వేర్వేరు ప్రాంతాల్లో చైనా మాంజా విక్రయిస్తున్న పలువురిని సికింద్రాబాద్ జోన్ పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి సుమారు రూ.2.50 లక్షల విలువ చేసే 162 బాబిన్‌లు, 6 సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం సికింద్రాబాద్ జోన్ డీసీపీ రక్షితాకె మూర్తి విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. కాచిగూడ పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే నోముల సంతోష్‌కుమార్(26), నోముల పుష్ప(35), లతిత్‌సింగ్(39), కాశిరామ్‌సింగ్( 38), ఓమ్‌ప్రకాశ్‌సింగ్(45), కపిల్( 35)లు చైనా మాంజాను విక్రయిస్తుండగా దాడిచేసి అరెస్టు చేశారు. వీరి వద్ద నుంచి 106 బాబిన్‌లు, 3 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
● దోమల్‌గూడ పోలీసు స్టేషన పరిధిలో నివసించే ప్రశాంత్(20), అఖిల్(19), పవన్(19), దీపక్(19), శివరాజ్‌లు విక్రయిస్తున్న 8 చైనా మాంజా బాబిన్లను పట్టుకున్న అరెస్టు చేశారు. అలాగే అంబర్‌పేట పోలీసు స్టేషన్ పరిధిలో నివసించే కె.సునిల్‌కుమార్(50) చైనా మాంజా విక్రయిస్తుండగా పట్టుకున్నారు. ఇతనితో ఉన్న చరణ్, రాజేష్‌లు పరారీలో ఉన్నారు. వీరి వద్ద 48 బాబిన్‌లను స్వాధీనం చేసుకున్నారు. అందరిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీసీపీ వెల్లడించారు.


