తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్
● అంతర్రాష్ట్ర నిందితుడి అరెస్టు
● బంగారు ఆభరణాలు స్వాధీనం
● రిమాండ్‌కు తరలింపు
షాద్‌నగర్: తాళాలు వేసే ఇళ్లే టార్గెట్ చేసుకొని రాత్రివేళ దొంగతనాలకు పాల్పడే ఓ అంతర్రాష్ట్ర నిందితుడిని శుక్రవారం షాద్‌నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పట్టణంలోని పోలీస్ స్టేషన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో సీఐ విజయ్‌కుమార్ వివరాలు వెల్లడించారు. మహారాష్ట్ర పుణే జిల్లా కాట్‌రాజ్‌కు చెందిన లఖాన్ అశోక్ కులకర్ణి కొంత కాలంగా తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్‌గా చేసుకొని రాత్రివేళ చోరీలకు పాల్పడుతున్నాడు. గత డిసెంబర్ 20న పట్టణంలోని గంజ్‌రోడ్డులో నివసిస్తున్న వన్నాడ అశోక్‌గౌడ్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసి ఆస్పత్రి నిమిత్తం హైదరాబాద్‌కు వెళ్లారు. తిరిగి డిసెంబర్ 23న వచ్చి చూడగా తాళం పగలగొట్టి, ఇంట్లోని బెడ్‌రూంలో ఉన్న కబోర్డు తాళాలు ధ్వంసం చేసి బంగారు నగలుతో పాటు రూ.ఐదు లక్షల నగదు దొంగిలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు సాంకేతికత ఆధారంగా లఖాన్ అశోక్ దొంగతనం చేసినట్లు గుర్తించారు. అతడిపై మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఏపీ రాష్ట్రాల్లో సుమారు 300 ఇళ్లలో చోరీ కేసులు ఉన్నాయని విచారణలో తేలింది. నిందితుడి నుంచి బంగారు చైన్, రెండు జతల చెవుల కమ్మలు, మూడు బంగారు ఉంగరాలు, మొత్తం 3.5 తులాల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకొని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. కేసును ఛేదించడంలో డీఐ వెంకటేశ్వర్లు, ఎస్‌ఐ శివారెడ్డి, క్రైం సిబ్బంది రవీందర్, మోహన్, కరుణాకర్, జాకీర్, రాజు, సంతోష్ కీలకంగా వ్యవహరించినట్లు సీఐ తెలిపారు.


