● సంప్రదాయ ‘తోరణం’
తాండూరు: శాస్త్రసాంకేతిక విధానంలో ఎంతగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ వ్యవసాయ రంగంలో పూర్వీకుల సంప్రదాయం ఇప్పటికీ కొనసాగుతోంది. ఇక్కడి రైతు కుటుంబాలు వారసత్వ పంటలను మరవడం లేదు. తాండూరు ప్రాంతంలో తెలంగాణ, కర్ణాటక ఆచార వ్యవహారాలు కనిపిస్తుంటాయి. ఇక్కడ ప్రధానంగా కంది, శనగ, కుసుమ, పప్పు దినుసు పంటలను ఎక్కువగా సాగు చేస్తారు. ఈ ప్రాంతంలోని నేలలు కందితో పాటు జొన్న సాగుకు అనుకూలంగా ఉంటాయి. ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండా జొన్న వేస్తారు. పెట్టుబడి లేకుండా మంచి దిగుబడి అందించే ఈ పంటను ధర్మం పంటగా పిలుస్తారు. అధిక పోషక విలువలుండే జొన్నలతో రొట్టెలు చేసి నిత్యం తింటారు. సంక్రాంతి సమయంలో జొన్న పంట ఇంటికి చేరుతుంది. వీటి కంకులను రైతులు గుమ్మాలకు తోరణాలుగా వేస్తారు.


