ఎన్నికల్లో గెలుపొందేవారికే టికెట్లు
షాద్‌నగర్: మున్సిపల్ ఎన్నికల్లో గెలుపొందే వారికే టికెట్లు ఇస్తామని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ స్పష్టం చేశారు. సోమవారం షాద్‌నగర్ పట్టణంలోని ఏబీ కాంప్లెక్స్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఏ పార్టీలతో పొత్తు లేకుండా ఒంటరిగానే పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు చెప్పారు. స్క్రూటీని నిర్వహించి, క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి గెలుపొందే అభ్యర్థులకే టికెట్లు ఇస్తామని ప్రకటించారు. షాద్‌నగర్ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ జెండాను ఎగురవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీజేపీ మద్దతుతో చాలా గ్రామాల్లో వార్డు సభ్యులు, సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు విజయం సాధించారని చెప్పారు. పార్టీ నాయకులు, కార్యకర్తలందరూ కలిసి కట్టుగా ముందుకు సాగాలని అన్నారు. సమావేశంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అందెబాబయ్య, పాలమూరు విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు విజయ్‌కుమార్, వెంకటేష్‌గుప్తా, వంశీకృష్ణ, రుషికేష్, అశోక్, వెంకటేష్, శ్రీనివాస్‌చారి, శివకుమార్, నర్సింహగౌడ్ తదితరులు పాల్గొన్నారు.


