ఉపాధి పథకం నిర్వీర్యానికి కుట్ర
యాచారం: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి కూలీల పొట్ట కొట్టడానికి కుట్రలు చేస్తుందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు పి.అంజయ్య ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై జారీ చేసిన జీవోల ప్రతులను సోమవారం యాచారం ఎంపీడీఓ కార్యాలయం ఎదుట దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు కొమ్ముకాస్తూ పేదలకు తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. ఉపాధి పథకాన్ని పూర్తిగా తీసేసే కుట్రలు చేస్తుందన్నారు. హామీ పథకానికి నిధులు తగ్గించడం, పనుల్లో పలు నిబంధనలు పెట్టడం అందుకు కారణమన్నారు. మహాత్మాగాంధీ పేరును తీసేసే జీవోలు విడుదల చేయడం సరైంది కాదన్నారు. కూలీలకు అన్యాయం చేయాలని చేస్తే ఆందోళన తప్పదని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు జంగయ్య, రాములు, జంగారెడ్డి, ఇందిరమ్మ, రమేశ్, నర్సింహ, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


