హెరాయిన్ స్వాధీనం.. నిందితుడి అరెస్ట్
కేపీహెచ్‌బీకాలనీ: నిషేధిత మత్తు పదార్థం విక్రయిస్తున్న ఓ వ్యక్తిని కేపీహెచ్‌బీ పోలీసులు సోమవారం అరెస్టు చేసి 25 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు తెలిపిన మేరకు.. బీహార్ రాష్ట్రానికి చెందిన అంజనీకుమార్ ఉపాధ్యాయ (31) సిగరెట్లలో గంజాయిని సేవించేవాడు. సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో రూ.25 వేలతో 25 గ్రాముల హెరాయిన్ కొనుగోలు చేసి రైలులో ఆదివారం రాత్రి సికింద్రాబాద్‌కు చేరుకున్నాడు. సోమవారం ఉదయం ఆటోలో కేపీహెచ్‌బీ బస్‌స్టాప్‌నకు చేరుకుని ఎటువెళ్లాలో తెలియక అక్కడ ఉన్న కొందరి వద్దకు వెళ్లి తన వద్ద ఉన్న మత్తు మందును కొనుగోలు చేయాలని కోరాడు. దీంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు అక్కడికి చేరుకుని అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద బ్యాగులో ఉన్న 25 గ్రాముల హెరాయిన్ స్వాధీనం చేసుకున్నారు.
పీజేఆర్‌కు సీఎం నివాళి
ఖైరతాబాద్: దివంగత నేత, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు పి.జనార్థన్ రెడ్డి జయంతి సందర్భంగా ఖైరతాబాద్ చౌరస్తాలో పీజేఆర్ విగ్రహానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నివాళులర్పించారు.పీజేఆర్ కుమార్తె, కార్పొరేటర్ విజయారెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మంత్రి దామోదర్ రాజనర్సింహ, ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యేలు రాజ్ ఠాగూర్, నవీన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.


