ఆలిండియా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక
యాచారం: మండల పరిధిలోని మంతన్‌గౌరెల్లి గ్రామానికి చెందిన రమావత్ పవన్‌నాయక్ ఆల్ ఇండియా యూనివర్సిటీ బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపికయ్యారు. ఓయూలో ఎంఏ హిస్టరీ చదువుతున్న పవన్, యూనివర్సిటీలో నిర్వహించిన అంతర్ కళాశాల టోర్నమెంట్‌లో అత్యుత్తమ ప్రతిభ కనబర్చి, ఆలిండియా టోర్నీకి సెలెక్టయ్యారు. ఈ నెల 14 నుంచి 17 వరకు తమిళనాడులో జరిగే ఆలిండియా స్థాయి పోటీల్లో ఓయూ తరఫున తలపడనున్నారు.
ఉన్నత లక్ష్యాల సాధనకు కృషి
సినీనటుడు ప్రదీప్
చేవెళ్ల: విద్యార్థి దశలోనే ఉన్నతమైన లక్ష్యాలను ఎంచుకొని, వాటి సాధన కోసం కృషి చేయాలని ప్రముఖ వక్త, సినీ ప్రము ఖుడు కేవీ.ప్రదీప్ అన్నా రు. చేవెళ్లలోని వివేకానంద జూనియర్, డిగ్రీ కళాశాల వార్షికోత్సవం సోమవారం ప్రిన్సిపాల్ జైపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రదీప్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. విద్యార్థులు వివేకానందుడు చూపించిన మార్గాల్లో నడవాలన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని తెలిపారు. తల్లిదండ్రులు, అధ్యాపకులకు, గ్రామానికి మంచి పేరుతీసుకువచ్చే విధంగా విద్యార్థులు ఎదగాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. కార్యక్రమంలో డి.ప్రభాకర్, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
వృద్ధురాలి కాలుకు మాంజా చుట్టుకుని గాయాలు
మీర్‌పేట: చైనా మాంజా చుట్టుకుని ఓ వృద్ధురాలి కాలుకు గాయమైన సంఘటన సంఘటన మీర్‌పేట పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అల్మాస్‌గూడకు చెందిన యాదమ్మ(75) సోమవారం సాయంత్రం తెలిసిన వారి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్తుండగా ప్రమాదవశాత్తు చైనా మాంజా కాలికి చుట్టుకుంది. వాహనం వేగంగా వెళ్తుండడంతో ఆమె కాలుకు తీవ్ర గాయమైంది. వెంటనే స్థానికులు చికిత్స నిమిత్తం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.
భక్తుడి ముసుగులో రూ.20 లక్షలు టోకరా...
బంజారాహిల్స్: భక్తుడి ముసుగులో నమ్మకాన్ని సంపాదించి ఆ తర్వాత స్థలం ఇప్పిస్తానని నమ్మబలికి రూ. 20 లక్షలకు టోకరా వేసిన ప్రబుద్ధుడిపై బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. వివరాల్లోకి వెళితే... బంజారాహిల్స్ రోడ్ నెంబర్–12లోని హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్ సమీపంలో నివసించే బాలగణేష్ గత 13 సంవత్సరాలుగా హరేకృష్ణ (ఇస్కాన్) ఉద్యమానికి అనుబంధంగా ఉంటూ హరేకృష్ణ గోల్డెన్ టెంపుల్‌లో అన్నదానం వంటి స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ వస్తున్నాడు. 2019లో వర్ధినీడి సత్యవెంకటరెడ్డినాయుడు అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తాను ఆధ్యాత్మికత కలిగినవాడినని భక్తుడిగా చూపించుకుని తరచూ ఆలయానికి వచ్చి బాలగణేష్‌తో సన్నిహితంగా మెలుగుతూ అతని నమ్మకాన్ని సంపాదించాడు. ఈ క్రమంలోనే సిద్దిపేట జిల్లా నర్సాపూర్ గ్రామంలో పదెకరాల స్థలం కొనుగోలు చేస్తున్నానని అబద్దం చెప్పి ఆ భూమిలో పెట్టుబడి పెడితే భూమి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తానని, తద్వారా సురిక్షితమైన లాభాలు వస్తాయని నమ్మబలికాడు. అతని మాటలు నమ్మిన బాలగణేష్ 2019, డిసెంబర్ 31న హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ నుంచి రూ. 20 లక్షలు వ్యక్తిగత రుణం తీసుకుని, అదే రోజున నిందితుడికి అందజేశారు. కానీ అప్పటి నుంచి ఎటువంటి భూమి రిజిస్ట్రేషన్ చేయలేదు. డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదు. ఎప్పటికప్పుడు అబద్దపు హామీలు ఇస్తూ కాలయాపన చేస్తూ వస్తున్నాడు. ఉద్దేశపూర్వకంగా డబ్బు తిరిగి ఇవ్వకుండా తప్పించుకుతిరుగుతున్నాడంటూ బాధితుడు బంజారాహిల్స్ పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
సినిమా చూస్తూ గుండెపోటుతో
రిటైర్డ్ ఏఎస్‌ఐ మృతి
కేపీహెచ్‌బీకాలనీ: సినిమా చూసేందుకు థియేటర్‌కు వచ్చిన ఓ రిటైర్డ్ ఏఎస్‌ఐ గుండెపోటుతో మృతి చెందిన సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్‌స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి తెలిపిన మేరకు.. సోమవారం భాగ్యనగర్ కాలనీలోని అర్జున్ థియేటర్‌లో లింగంపల్లికి చెందిన ఆనంద్‌కుమార్ మన శంకర వరప్రసాద్ సినిమా చూసేందుకు వచ్చాడు. ఉదయం 11.30 గంటల షోకు సినిమా చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. పక్కన సీట్లలో కూర్చున్న వారు థియేటర్ సిబ్బందికి సమాచారం అందించగా వారు పోలీసులకు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్ట్‌మార్టమ్ నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. సినిమా చూస్తున్న సమయంలో గుండెపోటుతో మృతి చెంది ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆలిండియా బ్యాడ్మింటన్ పోటీలకు ఎంపిక


