సరైన పరిహారం ఇవ్వాలి
● ఐటీ పార్క్ బాధిత రైతుల అభ్యర్థన
● కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం
మహేశ్వరం: నాగిరెడ్డిపల్లి గ్రామంలో ఐటీ పార్కు కోసం భూములు కోల్పోతున్న వారికి ఎకరానికి రూ.1.50 కోట్లు, 250 గజా ఇంటి స్థలం ఇవ్వాలని రైతులు, బీఆర్‌ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ నారాయణరెడ్డికి వినతిపత్రం అందజేశారు. మహేశ్వరం మండల పరిధిలోని నాగిరెడ్డిపల్లిలో ఐటీ పార్కు కోసం సుమారు 196 ఎకరాల పట్టా, సీలింగ్ భూములను తీసుకుంటున్నారన్నారు. ఈ భూమికి ఇటీవల కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి, తహసీల్దార్ చిన్న అప్పలనాయుడు ఎకరానికి కోటి పది లక్షల రూపాయల పరిహారం, 121 గజాల ప్లాట్ ఇస్తామని చెప్పారన్నారు. అయితే, తాము పట్టాదారుల నుంచి భూమిని కొనుగోలు చేశామని ఎకరాకురూ.1.50 కోట్ల పరిహారం, రామారావు చౌరస్తాలోని ప్రభుత్వ భూమిలో 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని ఒకేసారి అందజేయాలన్నారు. అంతకు ముందు కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డిని కలిసి వినతిపత్రం అందజేశారు. అధికారులను కలిసిన వారిలో నాగిరెడ్డిపల్లి సర్పంచ్ కాట్రావత్ బామినినాయక్, ఉప సర్పంచ్ నడికూడ జగన్, మాజీ ఎంపీటీసీ నడికూడ రమేశ్, మాజీ ఉప సర్పంచ్ కాట్రావత్ దేవులానాయక్, బీఆర్‌ఎస్ మండల ఉపాధ్యక్షుడు మిద్దె విద్యాకర్‌రెడ్డి, పాండునాయక్, శ్రీను, సిద్దులు తదితరులు పాల్గొన్నారు.
సరైన పరిహారం ఇవ్వాలి


