మాంజాతో మజాక్‌లొద్దు
షాబాద్: పతంగి ఎగురవేయడానికి వినియోగించే నిషేధిత చైనా మాంజా ప్రమాదకరంగా మారుతోంది. ఎగురవేసే వారి చేతి వేళ్లు తెగుతున్నాయి. పైగా రహదారులపై వెళ్తున్న వారి మెడకు బిగుసుకుపోవడంతో గొంతు దగ్గర గాయాలవుతున్నాయి. ఏటా రాష్ట్ర వ్యాప్తంగా మంజాతో గొంతు తెగి గాయాలైన సంఘటనలు అనేకం ఉన్నాయి. ఈ నెల 10వ తేదీ నుంచి సంక్రాంతి సెలవులు ఇచ్చారు. పిల్లలు ఇప్పటి నుంచే పతంగి సంబురాలు మొదలు పెట్టారు. వాటిని ఎగరేస్తున్న సమయంలో బాలురు తమ భద్రతను మరుస్తున్నారు. సాధారణంగా పిల్లలకు ప్రమాదాలపై అవగాహన తక్కువ. ఎలా జాగ్రత్తగా ఉండాలనే విషయం తెలియక సంబురాల్లో మునిగి ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు. దీనిపై షాబాద్ సీఐ కాంతారెడ్డి సూచనలు అందించారు.
పతంగుల సందడి
పతంగుల సందడి ప్రారంభమైంది. మార్కెట్‌లో దుకాణాలు సైతం వెలిశాయి. గాలిపటాలు అధునాతన డిజైన్లలో లభిస్తున్నాయి. దీంతో చిన్నారులు, యువకులు వీటి కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. గాలిపంటం సైజ్, నాణ్యతను బట్టి రూ.5 నుంచి రూ.25 వరకు అందుబాటులో ఉన్నాయి. రంగు కాగితాలతో చేసిన పతంగులను సైజ్‌ను బట్టి రూ.5 నుంచి రూ.40 వరకు విక్రయిస్తున్నారు. ప్రత్యేకంగా క్లాత్‌తో తయారుచేసిన భారీ పతంగులను రూ.130 చొప్పున విక్రయిస్తున్నారు. అలాగే పతంగులను ఎగరేయడానికి ఉపయోగించే(ధారం) మాంజాలలో కూడా అనేక రకాలు ఉన్నాయి.
ఇలా చేయాలి
● గాలిపటం ఎగరేయడానికి విశాల మైదానం ఎంపిక చేసుకోవాలి.
● పిల్లలంతా కలిసి గాలిపటం ఎగురవేస్తుంటే ఎవరైనా ఒకరు వారిని పర్యవేక్షించాలి.
● తక్కువ కఠినత్వం ఉన్న మాంజా లేదా ధారం ఉపయోగించినా చేతి వేళ్లకు బట్ట, గౌజ్‌లు వేసుకుంటే గాయం నుంచి తప్పించుకోవచ్చు.
● విద్యుత్ తీగలు, భవనాలు, వృక్షాలు.. ఇలా ఎతైన ప్రదేశాల్లో పడిన పతంగుల కోసం వెళ్లడం మానుకోవాలి.
● పతంగి ఎగురుతున్న సమయంలో ఎటూ చూసుకోకుండా పరుగెడుతూ గుంతలు, కాల్వల్లో పడకుండా, వాహనాల కారణంగా గాయపడకుండా వాటిని వదిలేయడం మంచిది.
● పెద్దవి ఫ్యాన్సీ రకం గాలిపటాలకు బదులు తేలికపాటివి వినియోగించేలా చూడాలి.
పతంగి సంబురం.. కావొద్దు విషాదం
పిల్లలకు తల్లిదండ్రులు జాగ్రత్తలు చెప్పాలి
గాలిపటాలు ఎగరేస్తున్న సమయంలో గమనించాలి
జాగ్రత్తలు మరవొద్దు
తల్లిదండ్రులు తమ పిల్లలను నిత్యం కనిపెడుతూ ఉండాలి.
భవనాలు, గోడలు, బాల్కనీల పైనుంచి గాలిపటాలు ఎగరేయొద్దు. గాలి వీచిన దిక్కు పతంగి ఎగురుతుంది. దానిపైనే శ్రద్ధ పెట్టి నడిస్తే పడిపోయే ప్రమాదం ఉంది.
గల్లీలు, భారీ భవన సముదాయాలు, విద్యుత్ తీగలు, సెల్‌ఫోన్ టవర్ల సమీపంలో గాలి పటాలు ఎగరేసే సాహసం చేయొద్దు.
పతంగి విద్యుత్ తీగలు, స్తంభాలు, వృక్షాలపై పడితే తీసుకునే ప్రయత్నం చేయొద్దు. గాలి పటాన్ని తీసుకునే ప్రయత్నంలో ప్రమాదాలకు గురవుతున్నారు.


