సర్పంచుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
తుక్కుగూడ: జిల్లా పరిషత్ కార్యాలయంలో సర్పంచుల సంఘాన్ని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా శివశంకర్‌రెడ్డి, కార్యనిర్వాహక అధ్యక్షురాలు మాధవిరాంరెడ్డి, ప్రధాన కార్య దర్శులుగా ఈ.రవి, పద్మకృష్ణ, ఉపాధ్యక్షులుగా గోపాల్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గోపాల్, కార్యనిర్వాహక కార్యదర్శిగా శ్రీనుతో పాటు మరికొంత మందిని కమిటీ సభ్యులుగా నియమించారు. ఈ సమావేశంలో పంచాయతీ రాజ్ చాంబర్స్ రాష్ట్ర అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధార్థ పాల్గొన్నారు.
వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కొత్తూరు: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. ఈ సంఘటన కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామికవాడ రోడ్డుపై ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ గోపాలకృష్ణ తెలిపిన వివరాల మేరకు.. నందిగామ మండలం చేగూరు గ్రామానికి చెందిన హనుమంతు(44) కొంత కాలంగా తీగాపూర్ శివారులో ఉన్న ఓ పరిశ్రమలో పనిచేస్తూ క్వాటర్స్‌లో నివాసం ఉంటున్నాడు. కాగా శనివారం విధులకు వెళ్లకుండా పాత జాతీయ రహదారి కూడలి వద్దకు వచ్చి తిరుగు ప్రయాణంలో కాలినడకన వెళ్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో మృతుడి ఆచూకీ తెలుసుకుని కుటుంబ సభ్యులకు తెలిపారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం షాద్‌నగర్ కమ్యూనిటీ ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి సత్యమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్‌ఐ వివరించారు.
యువకుడి దారుణ హత్య
నిందితుల కోసం గాలిస్తున్న పోలీసులు
కొత్తూరు: గుర్తు తెలియని ఓ యువకుడు దారుణహత్యకు గురైన సంఘటన కొత్తూరు పట్టణంలో ఆదివారం చోటు చేసుకుంది. సీఐ నర్సయ్య తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని శివానగర్ కాలనీలోని ఖాళీ స్థలంలో ఓ యువకుడి మృతదేహం పడి ఉందనే స్థానికుల సమాచారంతో అక్కడకు చేరుకున్నట్లు తెలిపారు. కాగా ప్రాథమిక విచారణలో భాగంగా ఓ ప్యాసెంజర్ ఆటోలో ఐదుగురు యువకులు కలిసి మధ్యాహ్నం ఇక్కడికి వచ్చి మద్యం తాగి గొడవ పడ్డట్లు తెలిసిందన్నారు. గొడవలో భాగంగా ఒకరిని నలుగురు యువకులు రాయి, ఖాళీ మద్యం బాటిళ్లతో కొట్టి హత్యకు పాల్పడ్డట్లు అనుమానం వ్యక్తం చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హైదరాబాద్‌లోని ఉస్మానియాకు తరలించినట్లు పేర్కొన్నారు. క్లూస్‌టీం, సాంకేతికత సహకారంతో త్వరలోనే నిందితులను అరెస్ట్ చేస్తామని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు సీఐ వివరించారు.
సర్పంచుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక
సర్పంచుల సంఘం జిల్లా కమిటీ ఎన్నిక


