హోరాహోరీ! | - | Sakshi
Sakshi News home page

హోరాహోరీ!

Dec 18 2025 10:58 AM | Updated on Dec 18 2025 10:58 AM

హోరాహ

హోరాహోరీ!

ఉత్కంఠ భరితంగా సాగినమూడో విడత పంచాయతీ ఎన్నికలు మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్‌ మద్దతుదారుల విజయం మీర్‌ఖాన్‌పేట, బేగరికంచెలో కారు జోరు కందుకూరులో కమల వికాసం ప్రశాంతంగా ముగిసిన పోలింగ్‌ 86.22 శాతం నమోదు

మహేశ్వరం మండల కేంద్రం వద్ద కలెక్టర్‌ నారాయణరెడ్డి తదితరులు

సాక్షి, రంగారెడ్డి జిల్లా: మూడో విడత పంచాయతీ ఎన్నికలు అధికార, ప్రతిపక్షాలు బలపర్చిన మద్దతుదారుల మధ్య హోరాహోరీగా సాగాయి. ఏడు మండలాల్లోని 174 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, మెజార్టీ స్థానాలు కాంగ్రెస్‌ సొంతం చేసుకున్నప్పటికీ.. ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌, బీజేపీలు కూడా అదేస్థాయిలో దూకుడు ప్రదర్శించాయి. ప్రతిష్టాత్మక గ్లోబల్‌ సమ్మిట్‌కు ఆతిథ్యం ఇచ్చిన కందుకూరు మండలం మీర్‌ఖాన్‌పేట సహా బేగరికంచె ఓటర్లు మాత్రం అధికార పార్టీని అంతర్మథనంలోకి నెట్టినప్పటికీ.. మిగతా చోట్ల హస్తం పార్టీకే పట్టం కట్టారు. ఇక యాచారం ఫార్మాసిటీ వ్యతిరేక పోరాట కమిటీ గ్రామాల్లో అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య ఓటింగ్‌ నువ్వా.. నేనా అనేలా కొనసాగింది. కందుకూరులో 35 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, వీటిలో 12 స్థానాలను బీజేపీ బలపర్చిన అభ్యర్థులు గెలుచుకోగా, మరో 13 స్థానాల్లో అధికార పార్టీ విజయం సాధించింది. తొమ్మిది స్థానాల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు జయకేతనం ఎగరేశారు. కేంద్ర బొగ్గు గనుల శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి స్వగ్రామమైన కందుకూరు మండలం తిమ్మాపూర్‌లో బీజేపీ బలపరిచిన అభ్యర్థి జి.అంజమ్మను గెలిపించుకొని పట్టు నిలుపుకొన్నారు. ఇక ఆ పార్టీ మాజీ జిల్లా అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి స్వగ్రామమైన కొత్తగూడలో ఆ పార్టీ బలపరిచిన అభ్యర్థి బొక్క సువర్ణ విజయం సాధించారు. తిమ్మాపూర్‌ సర్పంచ్‌ అంజమ్మను కేంద్ర మంత్రి అభినందించారు. మహేశ్వరం మండలంలో 30 పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించగా, అధికార, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారుల మధ్య హోరాహోరీ పోటీ కొనసాగింది. హస్తం ఖాతాలో 12 స్థానాలు, బీఆర్‌ఎస్‌ ఖాతాలో 12 చొప్పున పడ్డాయి. ఐదు స్థానాల్లో బీజేపీ బలపరిచిన అభ్యర్థులు గెలుపొందగా, ఒక చోట మాత్రం స్వతంత్ర అభ్యర్థి గెలుపొందారు. ఇబ్రహీంపట్నం మండలంలో 14 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించగా, ఎనిమిది చోట్ల ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు. అధికార కాంగ్రెస్‌ మాత్రం ఐదు స్థానాలకే పరిమితమైంది. ఒక చోట బీజేపీ మద్దతుదారు విజయం సాధించారు. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి మళ్లీ తన పట్టు నిలుపుకొన్నారు.

మంచాలలో అత్యధికం.. మెట్‌లో అత్యల్పం

మూడో విడత ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా ముగిశాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ఓటింగ్‌ ప్రక్రియ మొదలై.. మధ్యాహ్నం ఒంటి గంటకు ముగిసింది. చలి తీవ్రతకు తోడు, విపరీతమైన మంచు కారణంగా ఉదయం మందకొండిగా సాగిన ఓటింగ్‌ ప్రక్రియ 11 తర్వాత ఊపందుకుంది. మధ్యాహ్నం ఒంటి గంటలోపు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న వాళ్లకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. మధ్యాహ్నం రెండు తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలైంది. ఇబ్రహీంపట్నం, అబ్దుల్లాపూర్‌మెట్‌, మంచాల, యాచారం, మాడ్గుల, మహేశ్వరం, కందుకూరు మండలాల పరిధిలోని మొత్తం 174 పంచాయతీలు, 1598 వార్డులకు నోటిఫికేషన్‌ జారీ చేయగా, వీటిలో పది సర్పంచ్‌ స్థానాలు సహా 142 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 163 సర్పంచ్‌ స్థానాలకు 559 మంది పోటీ పడ్డారు. 1,448 వార్డులకు 4,091 మంది పోటీపడ్డారు. కోర్టు కేసు కారణంగా మాడ్గుల మండలం నర్సంపల్లి సర్పంచ్‌, 8 వార్డుల ఎన్నికలను తాత్కాలికంగా వాయిదా పడింది. ఈ గ్రామ పంచాయతీల పరిధిలో మొత్తం 2,93,852 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 2,53,371 మంది (86.22 శాతం) తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మహేశ్వరం మండలంలోని తుమ్మలూరు, మహేశ్వరం పోలింగ్‌ కేంద్రాలను జిల్లా కలెక్టర్‌ నారాయణరెడ్డి తనిఖీ చేశారు. ఓటింగ్‌ సరళిని పరిశీలించారు. అత్యధిక ఓటింగ్‌ శాతం మంచాల మండలంలో నమోదు కాగా, అత్యల్ప ఓటింగ్‌ శాతం అబ్దుల్లాపూర్‌మెట్‌లో రికార్డు అయింది.

పోలింగ్‌ శాతం ఇలా..

మండలం మొత్తం ఓటర్లు ఓటు వేసిన వారు శాతం

అబ్దుల్లాపూర్‌మెట్‌ 35,267 27,864 79.01

ఇబ్రహీంపట్నం 31,835 28,502 89.53

కందుకూరు 50,874 44,686 87.84

మాడ్గుల 42,200 36,717 87.01

మహేశ్వరం 44,096 36,416 82.58

మంచాల 39,385 35,739 90.74

యాచారం 50,195 3,447 86.56

మూడో విడతలో గెలుపొందిన ఆయా పార్టీల మద్దతుదారులు ఇలా..

మండలం కాంగ్రెస్‌ బీఆర్‌ఎస్‌ బీజేపీ ఇతరులు

అబ్దుల్లాపూర్‌మెట్‌ 07 04 01 02

ఇబ్రహీంపట్నం 05 08 01 –

కందుకూరు 13 09 12 01

మాడ్గుల 23 06 – 03

మహేశ్వరం 12 12 05 01

మంచాల 10 08 02 03

యాచారం 10 07 05 02

హోరాహోరీ!1
1/2

హోరాహోరీ!

హోరాహోరీ!2
2/2

హోరాహోరీ!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement