జోక్యం చేసుకోలేం..
జీహెచ్‌ఎంసీ వార్డుల పునర్విభజనపై పిటిషన్‌ల దాఖలు
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని వార్డుల్ఢసంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం జారీ చేసిన ప్రాథమిక నోటిఫికేషన్‌పై స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. డీలిమిటేషన్‌లో భాగంగా చేపట్టిన జనాభా వివరాలు, మ్యాప్‌లు బహిర్గతం చేయడంతో వచ్చే నష్టమేంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. 24 గంటల్లో వాటిని వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాలని జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ను ఆదేశించింది. వీటిపై అభ్యంతరాలు సమర్పించేందుకు పిటిషనర్లు, ప్రజలకు మరోరెండు రోజులు అవకాశం ఇచ్చింది (వాస్తవానికి ఈ నెల 17తో అభ్యంతరాలకు గడువు ముగిసింది). విభజనలో లోపాలున్నాయన్న పిటిషనర్ల వాదనపై.. ఇప్పుడు జోక్యం చేసుకోలేమని తేల్చిచెప్పింది.
నిబంధనలు పాటించలేదు..
జీహెచ్‌ఎంసీ డివిజన్ల సంఖ్యను పెంచుతూ వెలువడిన ప్రాథమిక నోటిఫికేషన్‌ను సవాల్ చేస్తూ పొన్న వెంకట్ రమణ, మరో ఇద్దరు హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. తెలంగాణ మున్సిపల్ కార్పొరేషన్లు (వార్డుల డీలిమిటేషన్) నిబంధనలు, 1996 ప్రకారం నిర్దేశించిన విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్ జారీ చేశారన్నారు. ఈ ప్రక్రియ చట్ట వ్యతిరేకం, ఏకపక్షం, రాజ్యాంగ విరుద్ధమన్నారు. అలియాబాద్ ప్రాంతాన్ని రెండు వార్డులుగా విభజించడంతో ప్రజా సౌకర్యాల లభ్యతపై ప్రతికూల ప్రభావం పడుతుందన్నారు. ప్రస్తుత డీలిమిటేషన్ స్థానిక స్వపరిపాలనకు అంతరాయం కలిగిస్తుందన్నారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీహెచ్‌ఆర్‌డీ)లో సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ రూపొందించిన అధ్యయన నివేదిక ఆధారంగా, జీవో 266 ప్రకారం డీలిమిటేషన్ కసరత్తు చేపట్టినట్లు ప్రభుత్వం చెబుతున్నా.. ఆ నివేదికను బహిర్గతం చేయలేదన్నారు.
అభ్యంతరాలపై రెండ్రోజులు గడువు పెంచిన హైకోర్టు
మ్యాప్‌లు, జనాభా లెక్కలు పబ్లిక్ డొమైన్‌లో పెట్టాలని సూచన
స్టే ఇస్తూ మధ్యంతర ఉత్తర్వుల జారీకి న్యాయస్థానం విముఖత
విస్తృత అధ్యయనం చేసిన తర్వాతే..
‘డీలిమిటేషన్ నిబంధనల్లోని 5వ నిబంధన ప్రకారం తాజా జనాభా లెక్కల ఆధారంగా వార్డుల ఏర్పాటు తప్పనిసరి. వార్డుల మధ్య జనాభా వ్యత్యాసం 10 శాతానికి మించకూడదు. విభజన తర్వాత వార్డుల జనాభా గణాంకాలను వెల్లడించలేదు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో మ్యాప్‌లు, సరిహద్దు వివరణ, ఇంటి సంఖ్య వివరాలు లేవు. ఇలా ఉంటే ప్రజలు వార్డు పరిమితులను గుర్తించడం అసాధ్యం. అలాగే ప్రభుత్వం పరిపాలనా, భౌగోళిక సామీప్యతను ఉల్లంఘించింది. కొన్ని వార్డులు బహుళ అసెంబ్లీ నియోజకవర్గాల్లోకి వెళ్లాయి. ప్రాథమిక నోటిఫికేషన్‌ను జీహెచ్‌ఎంసీ ప్రతినిధి జనరల్ బాడీ ముందు సరిగా ఉంచలేదు’ అని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు.ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ ఎ.సుదర్శన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వార్డుల విభజన ఒక్కరోజులో తీసుకున్న నిర్ణయం కాదన్నారు. విస్తృత అధ్యయనం, చర్చల తర్వాత చేపట్టామన్నారు. ‘ఇది ప్రజలకు మంచి ప్రయోజనం చేకూరుస్తుంది. ముఖ్యంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు మున్సిపాలిటీల విస్తరణతో పరిపాలనలో సత్ఫతాలిస్తుంది. ఇప్పటికే 3,102 అభ్యంతరాలు వచ్చాయి. ప్రతిదానికీ ఒక ప్రత్యేక సంఖ్య కేటాయించాం. అన్ని అభ్యంతరాలను పరిశీలించి, తగిన విధంగా స్పందిస్తాం’ అని చెప్పారు. పిటిషనర్ల తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది జె. ప్రభాకర్ వాదనలు వినిపిస్తూ.. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలను అర్థవంతంగా పరిగణించలేదని, వార్డుల వారీగా జనాభా డేటాను బహిర్గతం చేయలేదన్నారు. సుదీర్ఘ వాదనలు విన్న న్యాయమూర్తి.. వార్డుల విభజన ప్రక్రియను నిలిపివేయడానికి నిరాకరించారు. కాగా.. పారదర్శకత అవసరమని నొక్కి చెప్పారు. వార్డుల వారీగా జనాభా వివరాలు, ప్రామాణీకరించిన మ్యాప్‌లను 24 గంటల్లోపు పబ్లిక్ డొమైన్‌లో అప్‌లోడ్ చేయాలని అధికారులను ఆదేశించారు. తద్వారా ప్రజలు రెండు రోజుల వ్యవధిలో మరిన్ని అభ్యంతరాలు లేవనెత్తవచ్చని హైకోర్టు సూచించింది.
జోక్యం చేసుకోలేం..


