కన్నతల్లే కర్కశురాలై
● అపార్ట్‌మెంట్ పైనుంచి బిడ్డను కిందకు తోసేసిన వైనం
● అక్కడికక్కడే మృతిచెందిన ఏడేళ్ల చిన్నారి
మల్కాజిగిరి: కుటుంబ కలహాలు..క్షణికావేశం..ఓ చిన్నారి ప్రాణం తీసింది. కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతల్లే హంతకురాలైంది. తన ఏడేళ్ల బిడ్డను అపార్టుమెంట్ మూడో అంతస్తు పైనుంచి కిందకు నెట్టేసి దుర్మార్గానికి పాల్పడింది. ఈ విషాదకర ఘటన మల్కాజిగిరి పోలీస్ స్టేషన్ పరిధిలోని వసంతపురి కాలనీలో సోమవారం సాయంత్రం జరిగింది. ఈ మేరకు మంగళవారం ఇన్‌స్పెక్టర్ బి.సత్యనారాయణ తెల్పిన మేరకు..వసంతపురి కాలనీలోని గురుకృప అపార్ట్‌మెంట్ మూడో అంతస్తులో డేవిడ్, మోనాలిసా దంపతులు నివసిస్తున్నారు. వీరికి పదేళ్ల కుమారుడు, ఏడేళ్ల వయసున్ను కుమార్తె షరోన్ మేరీ ఉన్నారు. మేరీ స్ధానిక పాఠశాలలో ఒకటవ తరగతి చదువుతున్నది. మోనాలిసా ఒక మత ప్రచార సంస్ధలో పనిచేస్తుండగా, డేవిడ్ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ ఇటీవల ఇంటి వద్దనే ఉంటున్నాడు. గత కొద్దిరోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఆదివారం రాత్రి నుంచి వీరిద్దరు గొడవ పడుతున్నట్లుగా తెలిసింది. సోమవారం సాయంత్రం షరోన్ మేరీ తన తల్లి మొబైల్ ఫోన్ చూస్తుండగా ఆగ్రహించిన మోనాలిసా ఒక్కసారిగా బాలికను పైనుంచి కిందకు విసిరేసిందని భర్త డేవిడ్ ఫిర్యాదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. తీవ్రంగా గాయపడిన మేరీని స్థానిక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వైద్యులు పేర్కొన్నారు. భర్త డేవిడ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భిన్న వాదనలు
చిన్నారి మృతికి భార్యా భర్తల మధ్య కలహాలా..లేక దేవుడిపై నమ్మకం విషయంలో తలెత్తిన విభేదాలా అని స్థానికంగా భిన్నకథనాలు విన్పిస్తున్నాయి. అదే అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న వారు మాత్రం మోనాలిసా రోజూ డ్యూటీకి వెళ్లి వచ్చేదని, ఆమె మానసిక స్థితి బాగాలేదన్న విషయం తమకు తెలియదంటున్నారు. అప్పుడప్పుడు పిల్లలు ఏమైనా వస్తువులు కిందకు పడేస్తుంటారని, అదే విధంగా ఆదివారం కూడా ఏమైనా పడేశారేమోనని చూస్తే చిన్నారి రక్తం మడుగులో కనిపించందని ఓ వృద్ధురాలు తెలిపింది. ఆమె మానసిక స్థితి బాగాలేదని బంధువులు చెబుతున్నప్పటికీ, కుటుంబ సభ్యులు, భర్త ఫిర్యాదులో ఆ విషయాన్ని తెలియజేయలేదని, దర్యాప్తులో పూర్తి వివరాలు వెల్లడవుతాయని ఇన్‌స్పెక్టర్ తెలిపారు.
కన్నతల్లే కర్కశురాలై


