కన్హాలో ఏపీ సీఎం సందడి
నందిగామ: రంగారెడ్డి జిల్లా నందిగామ మండల పరిధిలోని కన్హా శాంతివనాన్ని ఏపీ సీఎం చంద్ర బాబునాయుడు సోమవారం సందర్శించారు. ఈ సందర్భంగా హార్ట్‌ఫుల్‌నెస్ సంస్థ గురూజీ, శ్రీరామచంద్ర మిషన్ అధ్యక్షుడు కమ్లేష్ పటేల్‌తో కలిసి ఆశ్రమ పరిసరాలను పరిశీలించారు. శాంతివనంలోని పచ్చదనాన్ని, బాయోచార్, రెయిన్ ఫారెస్ట్, టిష్యూ కల్చర్, హార్టికల్చర్, అగ్రికల్చర్ రంగాలతో పాటు పుల్లెల గోపీచంద్ బ్యాడ్మింటన్ అకాడమీని సందర్శించారు. మధ్యాహ్నం 12 గంటలకు కన్హాకు వచ్చిన చంద్రబాబు సాయంత్రం 4గంటల వరకు ఉన్నారు. ఆశ్రమంలోని ప్రతీ అంశాన్ని ధ్యాన గురువు కమ్లేష్ పటేల్‌ను అడిగి తెలుసుకున్నారు. కన్హాలో పచ్చదనం బాగుందని, ఏపీలో సైతం కన్హా శాంతి వనాన్ని ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిసింది. కాగా చంద్రబాబు కన్హాను సందర్శించేందుకు వచ్చిన విషయం తెలిసిన మీడియా కన్హా ఆశ్రమంలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా నిర్వాహకులు లోపలికి అనుమతించలేదు. వ్యక్తిగత పర్యటన అని చెప్పారు.
శాంతివనంలో పచ్చదనం బాగుందని కితాబు
మీడియాకు అనుమతి ఇవ్వని నిర్వాహకులు
వ్యక్తిగత కార్యక్రమమని వెల్లడి


