ఖర్చులకు కటకట!
ఒక్కో పోలింగ్ కేంద్రానికి కనీసం రూ.20 వేలు అవసరం రూ.5 వేలకు మించి ఇవ్వని ఎన్నికల కమిషన్ ఎంపీడీఓలు, కార్యదర్శులకు తప్పని తలపోటు
సాక్షి, రంగారెడ్డిజిల్లా: ఎన్నికల నిర్వహణ ఖర్చులు ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులకు గుదిబండగా మారాయి. ఓటర్ల జాబితా, నామినేషన్ పత్రాలు జీరాక్సులు సహా పోలింగ్ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పన, టెంట్లు, విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది భోజనాలకు కటకట తప్పడం లేదు. క్షేత్రస్థాయిలో అవుతున్న ఖర్చులకు.. ఎన్నికల కమిషన్ విదిల్చిన నిధులకు పొంతనే లేదు. ఇష్టం లేకపోయినా విధిలేని పరిస్థితుల్లో ఆయా ఖర్చులను ఎంపీడీ ఓలు, కార్యదర్శులే భరించాల్సి వస్తోంది. బీసీ రిజర్వేషన్ అంశంతో నోటిఫికేషన్ తరచూ వాయిదా పడటంతో ఆమేరకు ఓటర్ల జాబితా సహా నామినేషన్ పత్రాలను కూడా మార్చాల్సి వచ్చింది. ఒక్కో వార్డు, గ్రామానికి చెందిన ఓటర్ల జాబితాను రెండు మూడు సార్లు మార్చారు. కేవలం జీరాక్స్ కాపీలకే ఒక్కో ఎంపీడీఓ పరిధిలో రూ.లక్ష వరకు వెచ్చించాల్సి వచ్చింది. ఎన్నికల కమిషన్ ఒక్కో ఎంపీడీఓకు ఇప్పటి వరకు రూ.రెండున్నర లక్షలకు మించి ఇవ్వలేదు. మండల స్థాయిలోని ఖర్చులను పరిగణలోకి తీసుకుని, మిగిలిన మొత్తాన్ని పంచాయతీలకు చెల్లించాల్సి ఉంది. కానీ ఎన్నికల కమిషన్ ఇచ్చిన మొత్తం మండల పరిధిలోనే ఖర్చుకావడంతో పంచాయతీలకు నిధులు చేరలేదు. ఆయా ఏర్పా ట్లకు అవసరమైన నిధులను కార్యదర్శులే సమకూర్చాల్సి వచ్చింది.
ఏర్పాట్ల బాధ్యత వారిపైనే..
జిల్లాలో 526 పంచాయతీలు, 4,668 వార్డులకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి విడతలో 174 పంచాయతీలు, 1,530 వార్డులకు ఈనెల 11న ఎన్నికలు నిర్వహించగా, రెండో విడతలో 178 పంచాయతీలు, 1,540 వార్డులకు 14న పోలింగ్ నిర్వహించారు. మూడో విడతలో 174 పంచాయతీలు, 1,598 వార్డులకు 17న ఎన్నికలు జరగనున్నాయి. ప్రతి విడతలో పోలింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్ సహా ఆర్‌ఓలు, ఎఫ్‌ఎస్‌టీలు, ఎస్‌ఎస్‌టీలు, ఎంసీసీలు, భద్రతా సిబ్బంది కలిపి మొత్తం 4,500 మందికిపైగా సిబ్బంది విధులు నిర్వర్తిస్తున్నారు. ఓటర్ల జాబితా రూపకల్పన సహా రిటర్నింగ్ అధికారుల కేంద్రాల ఏర్పాటు, అభ్యర్థుల నుంచి నామినేషన్ పత్రాల స్వీకరణ, పరిశీలన, తుది జాబితా తయారీ, పోలింగ్ సామగ్రి తరలింపు, సిబ్బందికి భోజనాలు, పోలింగ్ కేంద్రాల్లో ధ్వంసమైన వాష్ రూమ్‌లకు రిపేర్లు చేయించడం, ఓటర్లు ఎండతాకిడికి గురికాకుండా ఆయా కేంద్రాల్లో టెంట్లు వేయించాల్సి వచ్చింది. తాగునీరు ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు ఒక్కో పోలింగ్ కేంద్రానికి సగటున రూ.20 వేల వరకు ఖర్చవుతుందని అంచనా. ఎన్నికల కమిషన్ మాత్రం ఇప్పటి వరకు రూ.5 వేలకు మించి ఇవ్వలేదు.
దాతల సహకారంతో భోజనం
జిల్లాలోని ఒక్కో ఎంపీడీఓ కేవలం జీరాక్స్ కాపీల కోసమే రూ.లక్ష వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. ఎన్నికల కమిషన్ ఇచ్చిన నిధులకు, క్షేత్రస్థాయిలోని ఖర్చులకు పొంతన లేకపోవడంతో ఆయా గ్రామాల్లో విధులు నిర్వర్తిస్తున్న కార్యదర్శులు ఇబ్బందిపడాల్సి వస్తోంది. రెండేళ్లుగా పాలకమండళ్లు లేకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన 15వ ఆర్థిక సంఘం నిధులు రాలేదు. మెజార్టీ జీపీల ఖాతాలు ఖాళీ అయ్యాయి. సిబ్బందికి వేతనాలు సైతం ఇవ్వలేని దుస్థితి. పాడైన వీధిలైట్లు స్థానంలో కొత్తవి కొనలేని పరిస్థితి. మోటార్ల రిపేర్లకే ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఎన్నికల నిర్వహణ ఖర్చు తలకు మించిన భారంగా మారింది. కొంత మంది బరిలో నిలిచిన అభ్యర్థులు అందించిన ఆర్థిక సహకారంతో సిబ్బందికి భోజన ఏర్పాట్లు చేస్తే.. మరికొంత మంది మాజీ సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ మాజీ సభ్యులు, ఇతర దాతల సహకారంతో ఏర్పాట్లు చేయాల్సి వచ్చిందని పేరు చెప్పడానికి ఇష్టపడని ఓ మండల స్థాయి అధికారి ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం జిల్లాకు కనీసం రూ.పది కోట్లు అవసరం కాగా, ఇప్పటి వరకు రూ.కోటి కూడా మంజూరు చేయలేదని తెలుస్తోంది.
తలకు మించిన భారంగా ఎన్నికల నిర్వహణ
ఖర్చులకు కటకట!


