‘మూడు’లో మూగబోయిన మైకులు
ముగిసిన మూడో విడత ఎన్నికల ప్రచారం చివరిరోజు హోరెత్తించిన అభ్యర్థులు రేపటి పోలింగ్‌కు కొనసాగుతున్న ఏర్పాట్లు
ఇబ్రహీంపట్నంలో ఎన్నికల ఏర్పాట్లను పరిశీలిస్తున్న జెడ్పీ సీఈవో కృష్ణారెడ్డి
ఇబ్రహీంపట్నం: మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రంతో తెరపడింది. వారం రోజులుగా పల్లెల్లో హోరెత్తిన మైకులు మూగబోయి, నిశబ్ద వాతావరణం నెలకొంది. ఇబ్రహీంపట్నం డివిజన్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అభ్యర్థుల గెలుపు కోసం చివరి రోజు జోరుగా ప్రచారం చేశారు. అభ్యర్థుల మధ్య నువ్వానేనా అనే రీతిలో పోటీ నెలకొంది.
రేపే 73 గ్రామాల్లో ఎన్నికలు
ఈనెల 17న (బుధవారం) డివిజన్ పరిధిలోని నాలుగు మండలాల్లో 73 పంచాయతీల సర్పంచ్, 694 వార్డులకు ఎన్నికలు జరుగనున్నాయి. ఇబ్రహీంపట్నం మండలంలో 14 సర్పంచ్, 140 వార్డులకు.. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలో 13 సర్పంచ్, 129 వార్డులకు.. యాచారం మండలంలో 24 సర్పంచ్, 220 వార్డులకు.. మంచాల మండలంలో 22 సర్పంచ్, 205 వార్డులకు పోలింగ్ జరుగనుంది. అబ్దుల్లాపూర్‌మెట్ మండలంలోని పెగ్లిపూర్, మంచాల మండలంలోని కొర్రవాణి తండా సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. డివిజన్ పరిధిలో 32 మంది వార్డు సభ్యులు ఏకగ్రీంగా ఎన్నికయ్యారు.
పోలీసు బందోబస్తు..
ఎన్నికల నిర్వహణకు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆర్వో, ఏఆర్వో, పోలింగ్ ఆఫీసర్, జోనల్ ఆఫీసర్లు, రూట్ ఆఫీసర్లను నియమించారు. సమస్యాత్మక గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద పోలీ సు బలగాలు మోహరించనున్నాయి. బ్యాలెట్ బాక్సులు, పత్రాలు, ఓటర్ జాబితా, బాక్స్‌లు సీల్ చేసే తదితర పోలింగ్ సామగ్రిని, సిబ్బందిని ఆయా గ్రామాలకు తరలించేందుకు ప్రత్యేకంగా బస్సులను ఏర్పాటు చేశారు.
ఏర్పాట్లు పరిశీలించిన జెడ్పీ సీఈఓ
ఎన్నికల నిర్వహణకు అధికారులు చకచకా ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం బ్యాలెట్ బాక్స్‌లు, బ్యాలెట్ పేపర్లు, సామగ్రి పంపిణీకి ప్రత్యేకంగా టెంట్‌లు వేసి సిద్ధం చేశారు. అదనంగా బ్యాలెట్ పేపర్లు అందుబాటులో ఉంచారు. ఇబ్రహీంపట్నం మండల పరిషత్ కార్యాలయాన్ని సోమవారం జిల్లా పరిషత్ సీఈవో కృష్ణారెడ్డి సందర్శించారు. ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించి సూచనలు చేశారు.
కొనసాగిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్
ఆయా మండల పరిషత్ కార్యాలయాల్లో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ సోమవారం కూడా కొనసాగింది. గ్రామాల వారీగా ఏర్పాటు చేసిన బ్యాలెట్ బాక్స్‌ల్లో ఎన్నికల విధుల్లో పాల్గొనే వారు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి
మాడ్గుల: ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలని జెడ్పీ సీఈఓ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల సందర్భంగా సోమ వారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలింగ్ రోజు ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, ఎన్నికల కమిషన్ రూపొందించిన హ్యాండ్‌బుక్‌ను ప్రతి పీఓ, ఏపీఓ తప్పకుండా చదివి నిబంధనలు పాటించాలని సూచించారు. పోలింగ్ రోజు వ్యవహరించాల్సిన విధి విధానాలు, పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ చేపట్టే అంశాలపై మాస్టర్ ట్రైనర్లు శిక్షణ ఇచ్చారు. కార్యక్రమంలో ఎంపీడీవో విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


