భావితరాలకు ఆదర్శం ‘రాజా బహదూర్’
మీర్‌పేట: భావితరాలకు రాజా బహదూర్ వెంకటరామరెడ్డి ఆదర్శమని మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితారెడ్డి పేర్కొన్నారు. మీర్‌పేట సర్కిల్ చందన చెరువు కట్టపై నూతనంగా ఏర్పాటు చేసిన వెంకటరామరెడ్డి విగ్రహాన్ని సోమవారం ఆమె ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. వెంకటరామరెడ్డి నిజాం పాలనలో హైదరాబాద్ స్టేట్‌కు పోలీస్ కమిషనర్‌గా సేవలు అందించి ప్రజల మన్ననలు పొందారని అన్నారు. ఉత్తమ పరిపాలన, ప్రజలకు చేసిన సేవలకు గాను నిజాం ప్రభుత్వం ఆయనను ‘రాజా బహదూర్’ బిరుదుతో సత్కరించిందని గుర్తుచేశారు. కార్యక్రమంలో టీయూఎఫ్‌ఐడీసీ చైర్మన్ చల్లా నర్సింహారెడ్డి, జిల్లెలగూడ రెడ్డి సంఘం అధ్యక్షుడు చల్లా ప్రభాకర్‌రెడ్డి, నాయకులు బొక్క రాజేందర్‌రెడ్డి, అర్కల కామేశ్‌రెడ్డి, మేకల రవిందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చెరువు అభివృద్ధి పనులు పూర్తి చేయాలి
చందన చెరువు అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఎమ్మెల్యే సబితారెడ్డి సర్కిల్ అధికారులను ఆదేశించారు. చెరువును సందర్శించిన ఆమె మాట్లాడుతూ 2021లో చెరువు అభివృద్ధికి ప్రతిపాదనలు పంపగా ఇటీవల రూ.2.25 కోట్లు మంజూరైనట్లు తెలిపారు. వాకర్స్, పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా వెంటనే పనులు చేపట్టాలని, మురుగునీరు చెరువులో కలవకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకోవాలన్నారు. చెరువు చుట్టూ పచ్చదనాన్ని పెంపొందించి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించాలని సూచించారు.


