ఎన్నికల నియమావళి పాటించాలి
ఇబ్రహీంపట్నం: ప్రశాంత వాతావరణంలో పంచాయతీ ఎన్నికలు జరుపుకోవాలని మహేశ్వరం డీసీపీ కె.నారాయణరెడ్డి సూచించారు. మండలంలోని తులేకాలన్ గ్రామాన్ని సోమవారం సందర్శించిన ఆయన ఓటర్లు, రాజకీయ పార్టీలకు చెందిన అభ్యర్థులతో స్నేహపూర్వక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఓటర్లు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకోవాలని అన్నారు. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు పోలీసులకు సహకరించాలని కోరారు. ఎన్నికల నియమావళిని పాటించాలన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, సీఐ ఎం.మహేందర్‌రెడ్డి, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ఎన్నికల నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు
యాచారం: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి హెచ్చరించారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సోమ వారం యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పోలీస్ స్టేషన్ల పరిధిలోని మీరాఖాన్‌పేట, యాచారం, గునుగల్ గ్రామాల్లోని పోలింగ్ కేంద్రాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహే శ్వరం డివిజన్ డీసీపీ పరిధిలో 471 మందిని బైండోవర్ చేసినట్లు, తనిఖీల్లో 1,800 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పోలింగ్ సందర్భంగా 1,200 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఎన్నికలు ప్రశాంతంగా ముగిసేలా సహకరించాలని కోరారు. కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం ఏసీపీ కేపీవీ రాజు, యాచారం, గ్రీన్ ఫార్మాసిటీ పీఎస్‌ల సీఐలు నందీశ్వర్‌రెడ్డి, సత్యనారాయణ పాల్గొన్నారు.
మహేశ్వరం డీసీపీ నారాయణరెడ్డి


