ముమ్మరంగా మూడో విడత
ప్రచారానికి దగ్గర పడుతున్న గడువు
● ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు తీవ్ర పాట్లు
● గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్న అభ్యర్థులు
ఇబ్రహీంపట్నం రూరల్: గడువు దగ్గర పడుతున్నా కొద్దీ మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎవరికి వారే గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాల్లో ముమ్మర ప్రచారం చేశారు. ఇక ప్రలోభాల ఎరవేతకు తీవ్ర ఎత్తుగడలు రచిస్తున్నారు. ఈ నెల 17వ తేదీన పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. దీంతో ఎలాగైనా సర్పంచ్, వార్డు స్థానాల్లో పాగా వేసేందుకు ఓటర్లకు మద్యం, డబ్బు ఇచ్చి ప్రసన్నం చేసుకుంటున్నారు. అవసరమైతే ప్రమాణాలు, బుజ్జగింపులు చేస్తూ ఓట్లు రాబట్టే పనిలో ఆయా పార్టీల మద్దతుదారులు బిజీగా ఉన్నారు.
రోజుకో తీరు ప్రచారం జోరు
సర్పంచ్, వార్డు సభ్యుల అభ్యర్థులు వారం రోజులుగా వినూత్నంగా ప్రచారాలు చేశారు. ప్రజలను వెంటేసుకొని ర్యాలీలు నిర్వహించడం, ఇంటింటికి తిరిగి అయ్యా, అమ్మా.. మీ ఓటు మాకే అని బతిమిలాడటం, ఆలింగనం చేసుకోవడం, కాళ్లు మొక్కడం చేస్తున్నారు. గుర్తులను చూపించుకుంటూ జోరుగా ప్రచారాలు కొనసాగిస్తున్నారు. జనం ర్యాలీలకు ఒక్కోక్కరికి రూ.200 నుంచి రూ.500ల వరకు ఇచ్చి ప్రచారం చేయించుకుంటున్నారు. ఓ వైపు ఓటర్లకు ఉపాధి కూడా దండిగా లభిస్తుంది. మరో వైపు ప్రచారానికి డబ్బులిస్తే ఓటు తమకే వేస్తారనే ధీమాలో అభ్యర్థులు ఉన్నారు.
అంతు చిక్కని ఓటరు నాడి
అభ్యర్థులు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు. పైకి మనమే గెలుస్తున్నామని తమ అనుచరులతో తెలుపుతున్నా లోపల మాత్రం భయంగా ఉంటున్నారు. పలానా ఇంట్లో మనకు ఎన్ని ఓట్లు వస్తాయని లెక్కలు వేసుకుంటున్నారు. కానీ ఓటరు మాత్రం అందరికీ ఒకే రకంగా సమాధానం ఇస్తున్నాడు. ఆయా గ్రామాల్లో కనీసం ఒక్కో ఓటరుకు రూ.ఐదు వేల వరకు ఎన్నికల తాయిలాలు చెందే అవకాశం ఉంది. చివరిరోజు ఇచ్చే నగదు బట్టి అభ్యర్థుల భవితవ్యం ఖరారు కానుంది.


