అనారోగ్యంతో మాజీ సర్పంచ్ మృతి
షాద్‌నగర్‌రూరల్: ఫరూఖ్‌నగర్ మండల పరిధిలోని రంగంపల్లి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చెక్కల రామయ్య(85) అనారోగ్యంతో శనివారం అర్ధరాత్రి గ్రామంలోని స్వగృహంలో మృతి చెందారు. ఆయన 1994 నుంచి 1999 వరకు ఎలికట్ట ఉపసర్పంచ్‌గా, 1999 నుంచి 2004 వరకు సర్పంచ్‌గా పనిచేశారు. సౌమ్యుడిగా, పిలిస్తే పలికే నాయకుడిగా చెక్కల రామయ్యకు ప్రజల్లో మంచి పేరు ఉంది. 2018లో నూతన గ్రామ పంచాయతీల ఏర్పాటులో భాగంగా బీఆర్‌ఎస్ ప్రభుత్వం రంగంపల్లిని ప్రత్యేక జీపీగా గుర్తించింది. దీంతో అప్పటివరకు ఎలికట్టలో కొనసాగిన రంగంపల్లి ప్రత్యేక జీపీగా ఏర్పడింది. ఎలికట్ట గ్రామాభివృద్ధికి చెక్కల రామయ్య అందించిన సేవలు మరువలేనివని పలువురు నాయకులు కొనియాడారు. విషయం తెలుసుకున్న పలువురు నాయకులు ఆయన మృతదేహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నివాళులర్పించిన వారిలో మాజీ ఎమ్మెల్యే బక్కని నర్సింలు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు అందె బాబయ్య, బీఆర్‌ఎస్ యువ నాయకుడు మురళీయాదవ్ ఉన్నారు.


