2 విడతకు..రెఢీ
చేవెళ్ల, కందుకూరు డివిజన్లలో ఎన్నికలు పోలింగ్, కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి పల్లెలకు చేరిన బ్యాలెట్‌బాక్స్‌లు, సిబ్బంది పటిష్టమైన పోలీసు బందోబస్తు
రెండో విడత పంచాయతీ సమరానికి సర్వం సిద్ధమైంది. కందుకూరు డివిజన్‌లోని 3 మండలాలు, చేవెళ్ల డివిజన్‌లో 4 మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. వారం రోజులపాటు గ్రామాల్లో అభ్యర్థులు విస్తృత ప్రచారం నిర్వహించారు. విజయం కోసం చివరి క్షణాల వరకు సర్వశక్తులూ ఒడ్డారు. ఇక పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో పోటీలో ఉన్నవారిలో టెన్షన్ మొదలైంది. అధికార కాంగ్రెస్‌పార్టీ, విపక్ష బీఆర్‌ఎస్, బీజేపీ బలపర్చిన అభ్యర్థులు హోరాహోరీగా తలపడుతున్నారు.మరి ఎవరిని అదృష్టం వరిస్తుందో.. ఎవరిని నిరాశకు గురి చేస్తుందోనేటితో తేలిపోనుంది.
– ఆమనగల్లు/చేవెళ్ల
జిల్లాలో రెండో విడత పంచాయతీ ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. బ్యాలెట్ బాక్సులు, ఎన్నికల సామగ్రితో సిబ్బంది వారికి కేటాయించిన గ్రామాలకు చేరుకున్నారు. కందుకూరు డివిజన్ పరిధిలోని ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల పరిధిలోని 61 పంచాయతీల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఆమనగల్లు మండలంలో 13 సర్పంచ్ స్థానాలకు గాను ఒక పంచాయతీ ఏకగ్రీవం కాగా మిగిలిన 12 చోట్ల 40 మంది అభ్యర్థులు, 112 వార్డులకు 20 ఏకగ్రీవం కాగా 92 స్థానాలకు 258 మంది పోటీలో ఉన్నారు. కడ్తాల్ మండలంలో 24 సర్పంచ్ స్థానాలకు నాలుగు ఏకగ్రీవం కాగా 20 సర్పంచ్ స్థానాలకు 59 మంది, 210 వార్డులకు 52 వార్డులు ఏకగ్రీవం కాగా 158 స్థానాలకు 453 మంది అభ్యర్థులు బరిలో మిగిలారు. తలకొండపల్లి మండలంలో 32 పంచాయతీలకు 3 ఏకగ్రీవం కాగా మిగిలిన 29 సర్పంచ్ స్థానాలకు 85 మంది, 272 వార్డులకు గాను 49 వార్డులు ఏకగ్రీవం కాగా 223 వార్డులకు 567 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు.
చేవెళ్ల డివిజన్‌లో ఇలా..
డివిజన్ పరిధిలోని చేవెళ్ల, మొయినాబాద్, షాబాద్, శంకర్‌పల్లి మండలాల్లో 109 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. చేవెళ్ల మండలంలో 25 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 23 పంచాయతీలకు 68 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 19 పంచాయతీ సర్పంచ్‌లకు 59 మంది, షాబాద్‌లో 41 పంచాయతీలకు ఒకటి ఏకగ్రీవం కాగా 40 గ్రామాల్లో 111 మంది అభ్యర్థులు, శంకరపల్లి మండలంలో 24 పంచాయతీలకు గాను రెండు ఏకగ్రీవం కాగా 22 చోట్ల సర్పంచ్ పదవికి 64 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. చేవెళ్ల మండలంలో 183 వార్డులకు 469 మంది అభ్యర్థులు, మొయినాబాద్ మండలంలో 157 వార్డులకు 434 మంది, షాబాద్ మండలంలో 305 వార్డులకు 794 మంది, శంకర్‌పల్లి మండలంలో 188 వార్డులకు 463 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
ఎన్నికలకు ఏర్పాట్లు పూర్తి
పోలింగ్‌కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆయా మండల కేంద్రాల్లోని ఎంపీడీఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల వద్ద శనివారం సిబ్బందికి అధికారులు సామగ్రి అప్పగించారు. ఎన్నికల నిర్వహణపైసలహాలు, సూచనలు చేశారు. అనంతరం సిబ్బంది బ్యాలెట్‌బాక్స్‌లు, ఎన్నికల సామగ్రితో తమకు కేటాయించిన పంచాయతీలకు ప్రత్యేక వాహనాల్లో బయలుదేరి వెళ్లారు. ఆమనగల్లు, కడ్తాల్ మండలాల్లోని డిస్ట్రిబ్యూషన్ కేంద్రాలను కందుకూరు ఆర్డీఓ జగదీశ్వర్‌రెడ్డి సందర్శించారు. చేవెళ్ల డివిజన్‌లోని కేంద్రాలను ఆర్డీఓ చంద్రకళ పరిశీలించారు. డీఈఓ సుశీందర్‌రావు, మండల ప్రత్యేకాధికారి వెంకటేశ్వర్‌రావు తగిన సూచనలు అందించారు.
ప్రలోభాల పర్వం
ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు ఎలాగైనా గెలవాలన్న లక్ష్యంతో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్తశస్త్రాలు వినియోగించారు. ఇంటింటికీ మద్యం, డబ్బులు పంపిణీ చేసినట్లు సమాచారం. హోరాహరీ పోరు తప్పదనుకున్న గ్రామాల్లో ఓటుకు రూ.3 వేల నుంచి రూ.5 వేల చొప్పున పంపిణీ చేసినట్లు తెలుస్తోంది. ఓటరు కటాక్షం ఏ అభ్యర్థికి వరంగా మారుతుందో అన్న ఉత్కంఠ నెలకొంది.
నేడు మలిదశపంచాయతీ పోరు
ఎన్నికలు జరగనున్న మండలాలు: 7
మొత్తం సర్పంచ్ స్థానాలు: 165
మొత్తం వార్డు స్థానాలు: 1,306
బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థులు: 499
పోటీలో ఉన్న వార్డు అభ్యర్థులు: 3,508
పోలింగ్ సమయం: ఉదయం 7 నుంచి మధ్యాహ్నం ఒంటిగంట


