పవర్‌ఫుల్ పదవి..
పల్లెకు సుప్రీం ప్రథమ పౌరుడే అయినా.. ఉప సర్పంచ్ పదవికి ప్రాధాన్యత సంతరించుకుంది. నిధుల వినియోగంలో సర్పంచితో పాటు సమానంగా పంచాయతీ రాజ్ చట్టం హక్కు కల్పించడంతో.. ఆ పదవికి బలం పెరిగింది. కుర్చీ కోసం పోటీ పెరిగింది.
పరిగి: గ్రామ పాలనలో ఉపసర్పంచ్ పదవి కీలక భూమిక పోషిస్తోంది. నామమాత్రపు పాత్రకే పరిమితమైన ఆ పదవి.. 2018 పంచాయతీ రాజ్ చట్టం ప్రకారం పవర్‌ఫుల్‌గా మారింది. గ్రామంలో నిధుల వినియోగంపై సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు కూడా ఉమ్మడి చెక్‌పవర్‌ను కట్టబెట్టారు. ఈ నిర్ణయం ఆ పదవికి బలం చేకూర్చింది. దీంతో ప్రస్తుత స్థానిక ఎన్నికల్లో ఈ పదవి దక్కించుకునేందుకు ఆశావహులు పోటీ పడుతున్నారు.
వారి దృష్టంతా దానిపైనే..
పరిగి నియోజకవర్గంలో మూడో విడత పంచాయితీ ఎన్నికలు ఈ నెల 17న జరగనున్నాయి. అందుకు అధికారులు అన్నీ సిద్ధం చేశారు. సెగ్మెట్‌లో 157 పంచాయతీలు ఉండగా, అందులో 18 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 139 గ్రామాలకు ఎన్నిక జరగనుంది. ఐదు మండలాల్లో 1,340 వార్డులు ఉండగా.. అందులో 306 ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,033కి ఎన్నిక జరగనుంది. అయితే సర్పంచ్‌ని నేరుగా ఓటర్లే ఎన్నుకుంటుండగా.. ఉప సర్పంచ్‌ను మాత్రం వార్డు సభ్యులు తమలో ఒకరిని ఎన్నుకుంటారు. గతంలో ఈ పదవికి అంతగా డిమాండ్ ఉండేది కాదు. వార్డు సభ్యుడికి ఉన్న అధికారాలే ఉపసర్పంచ్‌కు ఉండటం వలన అది అలంకారప్రాయంగానే ఉండేంది. పంచాయితీ రాజ్ చట్టం అమలుతో ఈ పోస్టుకు యమ గిరాకీ పెరిగింది. ముఖ్యంగా రిజర్వ్‌డ్ స్థానాల్లో ఉప సర్పంచికి పోటీ పెరిగింది. ఆ స్థానానికి రిజర్వేషన్ వర్తింపజేయకపోవడంతో సర్పంచ్ గిరి ఆశించి భంగపడిన వారు.. దీనిపై నజర్ పెట్టారు. ఈ పదవితో కూడా గ్రామ రాజకీయాలను శాసించవచ్చని భవిస్తూ బరిలో నిలుస్తున్నారు.
మంతనాలు షురూ
వార్డు మెంబర్‌గా విజయం సాధించి, ఉపసర్పంచ్‌ని చేజిక్కించుకోవాలన్న ఎత్తుగడలో చాలా మంది ఉన్నారు. ఈ పోస్టుకు అవసరమైన సంఖ్యా బలాన్ని సమీకరించుకునేందుకు ఇప్పటి నుంచే వార్డు బడిరలో నిలిచిన వారు.. మిగతా వారితో మంతనాలు సాగిస్తున్నారు. ఈ మేరకు వార్డు మెంబర్లుగా గెలవాలనే తమ క్యాంపుల్లో చేరేలా సంప్రదింపులు జరుపుతున్నారు. సర్పంచ్ ఓట్ల లెక్కింపు అనంతరం ఉప సర్పంచ్‌ని కూడా ఎన్నుకోవాల్సి ఉంటుంది. అందుకే ఇప్పటికే గెలుస్తారనే నమ్మకం ఉన్న అభ్యర్థులను మచ్చిక చేసుకునే పనిలో పడ్డారు.
నువ్వా.. నేనా!
సర్పంచ్, ఉప సర్పంచ్ జాయింట్ చెక్ పవర్ ఉంటుంది. విధుల నిర్వహణ సర్పంచ్‌లకే ఇచ్చారు. ప్రభుత్వ పథకాలు అమలులో విఫలమైతే సర్పంచ్‌పై చర్యలు తీసుకునే అవకాశం ఈ చట్టానికి ఉంది. ఉపసర్పంచ్ సహా పాలకవర్గాన్ని కూడా ఇందులో భాగస్వామ్యం చేయకపోవడం గమనార్హం. అంతే కాకుండా అక్రమ నిర్మాణాలు జరిగినా, నిర్ణీత వ్యవధిలో అనుమతులు మంజూరు చేయకున్నా సర్పంచ్‌పై వేటు పడుతుంది. ఉపసర్పంచ్‌కు మాత్రం మినాహాయింపు నిచ్చింది. పంచాయతీ నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్‌పవర్ కల్పించిన సర్కారు.. బాధ్యతలను మాత్రం పూర్తిస్థాయిలో సర్పంచ్‌లకే అప్పగించింది. దీంతో ప్రస్తుత పంచాయతీ ఎన్నికల్లో ఉపసర్పంచ్ పోస్టుకు నువ్వా నేనా అన్నట్టు పోటీ జరుగుతోంది.
ఉప సర్పచ్ పదవి కోసంవార్డు సభ్యుల పోటాపోటీ
నిధుల వినియోగంలో ఉమ్మడి చెక్‌పవర్
బాధ్యతలు పూర్తిగా సర్పంచ్‌కే
అయినా.. పవర్ కోసం ఆరాటం


