ఓటు.. ఎటు!
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల పర్వం తుది దశకు చేరింది. విజేతలెవరో.. ప్రజలు ఎవరికి పట్టం కడతారో..? నేటితో తేలిపోనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైంది మొదలు ప్రచారం ముగిసే వరకూ అనుచరులు, మద్దతుదారులతో హోరాహోరీగా గ్రామాల్లో మద్దతు కూడగట్టిన అభ్యర్థులు.. ఇక బ్యాలెట్ బాక్సుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఇదిలా ఉండా ప్రధాన పార్టీలు బలపర్చిన అభ్యర్థులు గెలుపు కోసం అన్ని అస్త్రాలను ప్రయోగిస్తున్నారు. ఏఅంశంలో వెనకబడినా ప్రత్యర్థికి అవకాశం చిక్కుతుందనే ధోరణిలో ఒకరికి మించి ఒకరు ముందుకు సాగుతున్నారు. ఎత్తుకు పైఎత్తులు వేస్తూ విజయమే పరమావధిగా పోరాడుతున్రాను. తెలిసినవారు, బంధువులు, స్నేహితుల ద్వారా ఓటర్లను మచ్చిక చేసుకుని, తమకే ఓటు వేసేలా చూసుకుంటున్నారు.
ఎంతైనా ఇద్దాం..
గ్రామాల్లో ఇప్పటీకే అభ్యర్థులు ఇచ్చిన హామీలతోపాటు ప్రచారంలో భాగంగా రోజు కూలీ, మందు, విందులు పూర్తయ్యాయి. ఇక ఒక్కో ఓటుకు రేటు కట్టి పంపకాలూ జరిగిపోయాయి. ఉన్నదల్లా ఓటర్లను తీసుకెళ్లి అనుకూలంగా ఓటు వేయించుకోవడం ఒక్కటే మిగిలింది. ఈక్రమంలో ఓటరు దేవళ్లు ఎవరివైపు మొగ్గు చూపుతారోననే టెన్షన్ అందరు అభ్యర్థుల్లోనూ కనిపిస్తోంది. కొంత మంది అభ్యర్థులు ముందుగానే తాయిలాలు ముట్టజెప్పి, ఇక ప్రత్యర్థులు ప్రలోభ పెట్టకుండా జాగ్రత్త పడుతున్నారు.
ప్యాకేజీలతో పిలుపు
గ్రామాలకు బయట ఉండే ఓటర్లను కలిసిన అభ్యర్థులు ఇప్పటీకే వారికి ప్రత్యేక ప్యాకేజీలను అందజేశారు. ఎలాగైనా ఊరికి వచ్చి ఓటేయాలని ప్రాధేయపడ్డారు. రవాణాఖర్చులు ఇవ్వడంతో పాటు అన్ని సదుపాయాలూ సమకూరుస్తామని చెప్పారు. ఓటేసేందుకు తప్పకుండా రావాలని అభ్యర్థించారు. ఇదిలా ఉండగా గ్రామాలకు వలస వచ్చిన వారికి సైతం స్థానికంగా ఓట్లు రావడంతో వారిని మచ్చిక చేసుకుని అన్ని హామీలు ఇచ్చేశారు.
చివరి దశకు చేరిన రెండో విడత పంచాయతీ ఎన్నికలు
ఎలాగైనా గెలవాల్సిందే.. సర్వశక్తులూ ఒడ్డిన అభ్యర్థులు
పోలింగ్ చివరి క్షణం వరకూ కొనసాగనున్న ప్రలోభాలు
ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు అన్ని అస్త్రాలూ ప్రయోగం
మిగిలింది ఓటు వేయించుకోవడమే


