విధులకు ఆలస్యంపై ఎంపీడీఓ ఆగ్రహం
● స్పృహతప్పి పడిపోయిన జూనియర్ అసిస్టెంట్
● ధారూరులో ఘటన
ధారూరు: ఎన్నికల విధులకు ఆలస్యంగా వచ్చిన ఓ ఉద్యోగిని ఎంపీడీఓ మందలించడంతో ఆందోళనకు గురై, స్పృహ తప్పి పడిపోయాడు. ఈ ఘటన వికారాబాద్ జిల్లా ధారూరులోని ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రం వద్ద శనివారం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. యాలాల మండలంలో జూనియర్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న ఆదిశేషాచారికి.. ఓ జీపీలో అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్‌గా విధులు కేటాయించారు. ఆయన సకాలంలో హాజరుకాకపోవడంతో ఎంపీడీఓ నర్సింహులు మండిపడ్డారు. ఎన్నికల విధులను నిర్లక్ష్యం వారిపై ఉన్నతాధికారులు కఠిన చర్యలు తీసుకుంటున్నారని తెలిసినా.. ఎందుకిలా వ్యవహరించారని మండిపడ్డారు. మిమ్మల్ని సస్పెండ్ చేసే అవకాశం ఉందని అందరిముందూ మైక్‌లో గద్దించడంతో స్పృహతప్పి పడిపోయాడు. ఇది గమనించిన మిగిలిన సిబ్బంది ఎంపీడీఓ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితి అదుపులోకి తెచ్చారు. ఏపీఓను ధారూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి, చికిత్స చేయించారు. అనంతరం ఇంటికి పంపించేశారు.


