తీర్పు.. ఇచ్చేనా ఓదార్పు!
ఎన్నికల్లో సర్వశక్తులు ఒడ్డిన అభ్యర్థులు అంతుచిక్కని ఓటరు నాడి నేటితో తేలిపోనున్న భవితవ్యం ఎడతెగని ఉత్కంఠ
చేవెళ్ల/షాబాద్: రెండో విడత పంచాయతీ ఎ న్నికల పర్వం తుది అంకానికి చేరుకుంది. గెలు పే లక్ష్యంగా ముమ్మర ప్రచారం సాగించిన అభ్యర్థులు శనివారం ఓటరు దేవుడి ప్రసన్నం కోసం చిట్టచివరి ప్రయత్నాలు వదలలేదు. గుట్టు చప్పుడు కాకుండా ఓటర్లకు తాయి లాలు, నగదు, మద్యం పంపిణీ చేసినట్లు సమాచారం. గ్రామాల్లో ఉన్న మహిళా సంఘాలు, కుల సంఘాలు, యువజన సంఘాల సభ్యులను వేర్వేరుగా కలిసి వారికి కావాల్సిన హామీలు గుప్పించడంతోపాటు ప్యాకేజీలు సైతం ముట్టజెప్పినట్టు తెలుస్తోంది.
ఓవైపు ధీమా.. మరోవైపు టెన్షన్
ఆదివారం పోలింగ్ జరుగుతుండడం..వెంటనే ఓట్ల లెక్కింపు కానుండడంతో అభ్యర్థుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. పోలింగ్‌కేంద్రాలకు వెళ్లే ఓటర్లు ఎవరికి ఓటు వేస్తారోనని..ఓటరు తీర్పు ఎలా ఉంటుందో నన్న తీవ్ర ఉత్కంఠ వారిలో నెలకొంది. ఎవరిని ఆదరిస్తారు..ఎవరినితిరస్కరిస్తారో తెలియక తలలు పట్టుకుంటున్నారు. ఎవరి వద్దకు వెళ్లిన నీకే నా ఓటు అంటూ చెప్పడంతో ఓవైపు ధీమాగా ఉన్నా మరోవైపు ఓటు వేయకపోతే పరిస్థితి ఏమిటోనన్న భయం వెంటాడుతోంది.
గెలవకుంటే ఎట్లా..?
ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనే లక్ష్యంతో అభ్యర్థులు స్థాయికి మించి ఖర్చు చేశారు. వారం రోజుల పాటు రోజు కూలీ రూ.500 నుంచి రూ.1000 వరకు ఇవ్వడంతోపాటు మందు, విందులు ఏర్పాటు చేశారు. ఓటుకు ఇంత అంటూ రేటు కట్టి మరీ ముట్టజెప్పారు. ఇంతా చేసినా ఓటరు తీర్పు ఎలా ఉంటుందోనని జంకుతున్నారు. ఉన్న ఆస్తులు తాకట్టు పెట్టాం.. అమ్ముకున్నాం.. అప్పులు తెచ్చి ఎన్నికల్లో నిలబడ్డాం.. గెలవకుంటే ఎలా అని కలవరానికి గురవుతున్నారు. ఏదేమైనా పంచాయతీ ఎన్నికలు పోటీలో ఉన్న అభ్యర్థులకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడతారో కొన్ని గంటల్లో తేలిపోనుంది.


