ఎన్నికలకు పటిష్ట భద్రత
శంషాబాద్ డీసీపీ రాజేశ్
ఆమనగల్లు: రెండో విడత పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా ఏర్పాటు చేసినట్లు శంషాబాద్ డీసీపీ రాజేశ్ తెలిపారు. ఎన్నికల బందోబస్తు, విధి నిర్వహణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని అన్నారు. ఆమనగల్లు, తలకొండపల్లి, కడ్తాల్ మండలాల్లో విధులు నిర్వర్తించనున్న సిబ్బందికి శనివారం పలు సూచనలు చేశారు. ఆయా మండలాల్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సందర్భంగా శాంతి భద్రతలను కాపాడడంలో పోలీసు సిబ్బంది పాత్ర కీలకమని పేర్కొన్నారు. నిర్లక్ష్యం వహించకుండా అంకితభావం, క్రమశిక్షణతో తమ బాధ్యతలు నిర్వర్తించాలని కోరారు. ఎన్నిక ప్రక్రియ పూర్తయ్యేవరకు కేటాయించిన ప్రాంతాలను వదలరాదని, పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లను క్రమపద్ధతిలో ఉంచాలని ఆయన సూచించారు. పోలింగ్ కేంద్రంలోకి అనుమతి లేని వ్య క్తులను, ఓటరు కానివారిని రానివ్వొద్దని, ఓట ర్లు సెల్‌ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ వస్తువులు తీసుకురాకుండా చూడాలని చెప్పారు. ఏమైనా ఇబ్బందులుంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. ఎన్నికలు ప్రశాంతంగా, పారదర్శకంగా జరిగేందుకు సిబ్బంది సమన్వయంతో కృషి చేయాలన్నారు. ఓటరు నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించేలా చూడాలన్నారు.ఆయా సమావేశాల్లో షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ, ఆమనగల్లు సీఐ జానకీరాంరెడ్డి, కడ్తాల్ సీఐ గంగాధర్, ఎస్‌ఐలు వెంకటేశ్, వరప్రసాద్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


