న్యూ ఇయర్ ఈవెంట్లకు అనుమతి తప్పనిసరి
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో టికెట్లు విక్రయిస్తూ న్యూ ఇయర్ ఈవెంట్లు నిర్వహించేవారు పోలీసుల నుంచి కచ్చితంగా అను మతి తీసుకోవాలని కొత్వాల్ సజ్జనర్ స్పష్టం చేశారు. ఈ మేరకు శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. కనీసం 15 రోజుల ముందు (ఈ నెల 16వ తేదీ లోపు) దరఖాస్తు చేసుకుని అను మతి పొందాలని పేర్కొన్నారు. ఈ నెల 31 రాత్రి హోటల్స్, పబ్స్, క్లబ్స్ తదితరాలు అర్ధరాత్రి ఒంటి గంట (తెల్లవారితే జనవరి 1) వరకే పని చేయాలని తెలిపారు. సీసీ కెమెరాలు, అవసరమైన స్థాయిలో ప్రైవేట్ సెక్యూరిటీ గార్డులు, తగినంత పార్కింగ్ స్థలం కచ్చి తమన్నారు. బహిరంగ ప్రదేశాల్లో జరిగే ఈవెంట్లలో డీజే తదితరాలకు అనుమతి లేదని ఆయన ప్రకటించారు. కార్యక్రమం జరిగే ప్రాంతం బయటకు ఎలాంటి శబ్ధం వినిపించకూడదని, అతిక్రమించి ఇతరులకు ఇబ్బంది కలిగిస్తే తీవ్రంగా పరిగణిస్తామని స్పష్టం చేశారు. మద్యం మత్తులో ఉన్న వారిని సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేర్చేలా డ్రైవర్లు/క్యాబ్‌లను నిర్వాహకులు ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ‘డిజిగ్నెటెడ్ డ్రైవర్’ విధానంపై విస్తృతంగా ప్రచారం చేయాలి. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహన యజమానులదే బాధ్యత అవుతుంది. మద్యం తాగి వాహనాలు నడుపుతూ చిక్కితే రూ.10 వేల జరిమానా లేదా ఆరు నెలల వరకు జైలు శిక్ష ఉంటాయి. డ్రైవింగ్ లైసెన్సులు సైతం కనిష్టంగా మూడు నెలలు రద్దు అవుతాయి. ఈ విషయాలు ఈవెంట్ జరిగే చోట ప్రదర్శించడంతో పాటు ప్రచారం చేయాలని కొత్వాల్ పేర్కొన్నారు.


