సందడిగా ‘సమ్మిట్’ ప్రాంగణం
కందుకూరు: ప్రభుత్వం ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం శుక్రవారం మూడో రోజు విద్యార్థులు, సందర్శకులతో సందడిగా మారింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన విద్యార్థులు సమ్మిట్‌లో ఏర్పాటు చేసిన స్టాళ్లనుఆసక్తిగా తిలకించారు. రోబోలతో స్వాగతం, ఏఐ ఫొటో ఇమేజ్‌లు తీసుకోవడం, స్టాళ్లలో ఏర్పాటు చేసిన విషయాల గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధాన వేదికలో ఎమర్జింగ్ టెక్నాలజీ అనే థీమ్‌తో రియల్ లైఫ్‌లో రిజిలియెన్స్ అనే అంశంపై చర్చ నిర్వహించారు. యూఐడీఏఐ మాజీ చైర్మన్ జి.సత్యనారాయణ, ఛీప్ డెలివరీ ఆఫీసర్ జితేంద్ర పుచ్చ, మాస్టెక్ డిజిటల్ శ్రీనివాస్ ఆత్రేయ, సీటీఓ అవికా, క్యూవైఎల్‌ఐఎస్ సీఈఓ కిషోర్ ఉప్పలపాటి చర్చా వేదికలో పాల్గొన్నారు. వేగంగా మారుతున్న టెక్నాలజీ ప్రపంచంలో రిజిలియెన్స్ యొక్క ప్రాముఖ్యత, వ్యక్తిగత, వృత్తిపరంగా ఎదురయ్యే ఒత్తిళ్లు, సవాళ్లను ఎదుర్కోవడం, కొత్త మార్పులకు త్వరగా అలవాటు పడే నాయకత్వ నైపుణ్యాలు, ఏఐ, ఎంఎల్ వంటి ఆధునిక సాంకేతికతల నేపథ్యంలో భవిష్యత్ సిద్ధత తదితర అంశాలపై విద్యార్థుల సమక్షంలో విస్తృత స్థాయిలో చర్చ నిర్వహించారు. అనంతరం కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. సందర్శనకు శనివారం చివరి రోజని, ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు మాత్రమే అనుమతి ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.


