ముగిసిన రెండో విడత ప్రచారం
చివరిరోజు పోటాపోటీగా క్యాంపెయిన్ ఓటరు ప్రసన్నంకోసం ఇక ప్రలోభాల పర్వం మందు, విందు, తాయిలాలపై దృష్టి ఓటుకు రేటు కట్టి నోటు పంపిణీకి సిద్ధం
చేవెళ్ల: రెండో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం శుక్రవారంతో ముగిసింది. చివరి రోజు ఆఖరి నిమిషం వరకు అభ్యర్థులు పోటాపోటీగా గడపగడపనూ చుట్టేశారు. ఈనెల 14న పోలింగ్ జరగనున్న డివిజన్‌లోని అన్ని పంచాయతీల్లో వారం రోజులుగా హామీల వర్షం కురిపించారు. భారీ ర్యాలీలతో తమ బలం చాటుకున్నారు. బలాబలాల ప్రదర్శన ముగియడంతో ఇక అసలు రాజకీయం మొదలైంది. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రలోభాలకు తెర లెపారు. మందు, విందు, తాయిలాల పంపిణీ మొదలు పెట్టారు.
ఖర్చుకు వెనుకాడకుండా..
నగరానికి అతీ సమీపంలో ఉన్న జిల్లాలో రియల్ ప్రభావంతో భూముల రేట్లు పెరిగినట్లుగానే ఎన్నికల్లో ఓటర్లకు ఓటు రేటు కూడా పెరిగిపోయింది. చిన్నచిన్న పంచాయతీల్లో సైతం ఓటుకు రూ.3వేల నుంచి రూ.10వేల దాకా ఖర్చు చేస్తున్నారు. ప్రత్యర్థి ఏం చేస్తున్నాడో, ఎంతిస్తున్నాడో తెలుసుకొని అంతకు మించి పంపకాలు మొదలుపెట్టారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు తీసిపోని విధంగా స్థాయికి మించి ఖర్చు చేస్తున్నారు.


