పోస్టల్ బ్యాలెట్‌కూ స్వస్తిక్ మార్కు ఇవ్వాలి
శంకర్‌పల్లి: ప్రభుత్వ ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ ద్వారా రహస్యంగా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్నా అది బహిర్గతం అవుతోందని టీయూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రఘునందన్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. మున్సిపల్ కేంద్రంలో శుక్రవారం ఆయన మాట్లాడుతూ.. ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్‌లో పెన్నుతో రైట్ మార్కు ఇచ్చి తమ ఓటును వేస్తారని, దీంతో ఓట్ల లెక్కింపు సమయంలో ఓటు ఎవరు వేశారు అనే విషయం బహిర్గతమవుతోందని అన్నారు. సాధారణ పౌరులు స్వస్తిక్ మార్కు ద్వారా ఓటు వేసినట్లే, తమకూ అవకాశం ఇవ్వాలని, పోస్టల్ బ్యాలెట్ ఓట్లను విడిగా కాకుండా, అందరితో పాటే లెక్కించాలని కోరారు. దీనిపై ఇప్పటికే పలుమార్లు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఎన్నికల సంఘం గుర్తించాలని విజ్ఞప్తి చేశారు.


