గులాబీలో జోష్
బషీరాబాద్: పంచాయతీ ఎన్నికల ఫలితాలు గు లాబీ శ్రేణుల్లో కొత్త జోష్ నింపాయి. అధికార కాంగ్రెస్ పార్టీని ఢీకొట్టి మెజార్టీ జీపీల్లో బీఆర్‌ఎస్ మద్దతుదారులు పాగా వేయడంతో ఆ పార్టీ శ్రేణులు, నేతల్లో నూతనోత్తేజం కనిపిస్తోంది. మండలంలో 39 జీపీలు ఉండగా బాబునాయక్‌తండా, హంక్యానాయక్‌తండా, నంద్యానాయక్‌తండా, మంతన్‌గౌడ్, బాద్లాపూర్ ఏకగ్రీవమై, కాంగ్రెస్ ఖాతాలోకి వెళ్లాయి. మిగిలిన 34 గ్రామాల్లో ఎన్నికలు నిర్వహించగా, 17 చోట్ల బీఆర్‌ఎస్ మద్దతుదారులు సర్పంచ్‌లుగా విజయం సాధించారు. ఇందులో మేజర్ జీపీలైన జీవన్గీ, నీళ్లపల్లి, పర్వత్‌పల్లి, దామర్‌చెడ్, నవల్గా, మంతట్టితో పాటు గొట్టిగకలాన్, కొర్విచెడ్, కొర్విచెడ్‌గని, గంగ్వార్, క్యాద్గీరా, ఇందర్‌చెడ్, అల్లాపూర్, కొత్లాపూర్, కుప్పన్‌కోట్, మల్కన్‌గిరి, కంసాన్‌పల్లి(ఎం)ఉన్నాయి. అయితే అధికార పార్టీకి చెందిన బలమైన నాయకులు ఉన్న మేజర్ పంచాయతీల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు సర్వశక్తులు ఒడ్డినా పరాజయం పాలవడంపై నేతల్లో నైరాశ్యం అలుముకుంది. జీవన్గీలో అధికార పార్టీ అభ్యర్థి కే.నర్సిములు, బీఆర్‌ఎస్ అభ్యర్థి రామని బసప్ప మధ్య హోరాహోరీ పోరు జరిగింది. రెండు పార్టీల మద్దతుదారులు ఐదేసి చొప్పున వార్డులను గెలుచుకోగా, సర్పంచ్ స్థానం మాత్రం బీఆర్‌ఎస్ అభ్యర్థి రామని బసప్ప కై వసం చేసుకున్నారు. అలాగే నీళ్లపల్లిలో దశాబ్దాలుగా అనేక పదవులు అలంకరించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పటోళ్ల సుధాకర్‌రెడ్డిని బీఆర్‌ఎస్ నుంచి పోటీ చేసిన వేణుగోపాల్‌రెడ్డి అనే యువకుడు ఓడించాడు. అలాగే పర్వత్‌పల్లిలోనూ అధికార పార్టీ అభ్యర్థి జనార్దన్‌రెడ్డిని గులాబీ పార్టీ మద్దతుదారుడైన పాండురంగారెడ్డి చిత్తు చేశాడు. బీఆర్‌ఎస్ మద్దతుతో గెలిచిన సర్పంచును మాజీ ఎమ్మెల్యే ఘనంగా సన్మానించారు.
వేరు కుంపట్లే పుట్టిముంచాయా..?
అధికార పార్టీలో ఎమ్మెల్యే మహనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్‌రెడ్డి వర్గాలుగా.. పార్టీ నాయకులు, శ్రేణులు రెండుగా విడిపోయాయి. ఎమ్మెల్యే వర్గంలోనూ నేతల మధ్య సఖ్యత లేకపోవడంతో రెండు బలమైన సామాజికవర్గాల నాయకులు వేర్వేరు కుంపట్లు పెట్టుకున్నారు. దీంతోనే బషీరాబాద్ మండల కేంద్రంలో ఇద్దరూ కాంగ్రెస్ కాంగ్రెస్ అభ్యర్థులే పోటీ పడ్డారు. ఇక్కడ పోటీలో ఉన్న బీఆర్‌ఎస్ అభ్యర్థి తప్పుకోవడంతో వెంకటేశ్ మహరాజ్ భారీ మెజార్టీతో గెలుపొందారు.
కాంగ్రెస్ ఖాతాలో 21 జీపీలు
మండలంలోని 34 పంచాయతీల్లో 17 గ్రామాలు బీఆర్‌ఎస్ కై వసం చేసుకోగా, 16 జీపీల్లోనే అధికార కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఏకగ్రీవమైన 5 పంచాయతీలు కలిపి ఆ సంఖ్య 21కి చేరింది. వీరు శుక్రవారం ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ కండువా కప్పుకొన్నారు. ఇదిలా ఉండగా కంసాన్‌పల్లి(బి)లో స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన బీజేపీ నాయకురాలు సునీతా గ్రామాభివృద్ధి కోసం అధికార కాంగ్రెస్‌లో చేరనున్నట్లు తెలుస్తోంది.
బషీరాబాద్ మండలం మేజర్ జీపీల్లో బీఆర్‌ఎస్ అభ్యర్థుల పాగా
‘పైలెట్’ మద్దతుతో కారెక్కిన 17 మంది గ్రామ ప్రథమ పౌరులు
వర్గపోరుతో దెబ్బతిన్న అధికార పార్టీ
కాంగ్రెస్ గూటికి కంసాన్‌పల్లి(బి) సర్పంచ్?
గులాబీలో జోష్


