హామీల అమలులో ప్రభుత్వం విఫలం
● కాంగ్రెస్‌ను విశ్వసించని ప్రజలు
● స్థానిక ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు బ్రహ్మరథం
● మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి
తాండూరు: ‘మోసపూరిత వాగ్ధానాలతో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టింది. ఇచ్చిన హామీల అమలులో విఫలమైంది. అందుకే ఆ పార్టీపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లింది. పంచాయతీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్ బ్రహ్మరథం పట్టారు. ఈ ఫలితాలతో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి అధ్యాయం ముగిసింది. మరో మూడేళ్లలో తిర్మలాపూర్ వెళ్లేందుకు మూటముల్లె సర్దుకోవాలి’ అని మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి విమర్శించారు. శుక్రవారం ఆయన నివాసంలో పార్టీ మండల అధ్యక్షులు, నాయకులతో కలసి నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. పంచాయతీ ఎన్నికల్లో ఇరు పక్షాల నుంచి పోటీ ఉంటుందని, అయితే బీఆర్‌ఎస్ బలపర్చిన అభ్యర్థులను కాంగ్రెస్ నాయకులు బెధిరింపులకు గురిచేశారని ఆరోపించారు. వారు ఎన్ని కుట్రలు పన్నినా.. నియోజవకర్గంలోని నాలుగు మండలాల్లో ఇప్పటి వరకు బీఆర్‌ఎస్ బలపర్పించిన 70 మంది సర్పంచ్‌గా ఎన్నికయ్యారని తెలిపారు. ప్రజలకు మాపై విశ్వాసం ఉందని అనడానికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లో జెడ్పీటీసీ స్థానాలను గెలిచి, జెడ్పీపీఠాన్ని కై వసం చేసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ఎంపీటీసీలను గెలిచి, ఎంపీపీలను దక్కించుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు నర్సిరెడ్డి, వీరెందర్‌రెడ్డి, పంజుగుల శ్రీశైల్‌రెడ్డి, రాంలింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


