రియల్ ఎస్టేట్ కోసమే మూసీ సుందరీకరణ
హిమాయత్‌నగర్ : మూసీ రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును వెంటనే ఆపివేయాలని ‘సేవ్ మూసీ మూవ్‌మెంట్’ సంస్థ డిమాండ్ చేసింది. రియల్ ఎస్టేట్ కోసమే మూసీ సుందరీకరణ చేపడుతున్నారని, ఇది అవసరం లేదని, మూసీని శుద్ధి చేయాలని డిమాండ్ చేసింది. మూసీ నిజమైన పునరుజ్జీవం కోసం నిపుణులు, పౌర సమాజంతో కలిసి ప్రజలకు, పర్యావరణానికి మేలు చేసే ప్రణాళిక రూపొందించాలని కోరింది. గురువారం బషీర్‌బాగ్ దేశోద్ధారక భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కై ్లమేట్‌ఫ్రంట్ హైదరాబాద్ ప్రధాన కార్యదర్శి సొండే అన్సార్, సేవ్ మూసీ మూవ్‌మెంట్ ప్రతినిధులు జాన్ మైఖేల్, రుచిత్ ఆశా కమల్, డీబీఎఫ్ ప్రతినిధి పులి కల్పన, హెచ్‌ఆర్‌ఎఫ్ ప్రతినిధి సయ్యద్ బిలాల్, డీబీఎఫ్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంకర్, తెలంగాణ క్రాంతిదళ్ ప్రతినిధి పృథ్వీరాజ్, తెలంగాణ విఠల్, పిట్టల శ్రీశైలం, ఫిల్మ్ డైరెక్టర్ సయ్యద్ రఫీ తదితరులు మాట్లాడారు. గ్లోబల్ సమ్మిట్‌లో ప్రపంచ పెట్టుబడిదారులకు మెరిసే రివర్ ఫ్రంట్ కలను చూపిస్తూ..ప్రభుత్వం ఎన్నో సామాజిక కోణాలను విస్మరించిందని ఆరోపించారు.
● డీపీఆర్ విడుదల చేయకుండా, ప్రజలతో సమావేశాలు నిర్వహించకుండా, పర్యావరణ–సామాజిక ప్రభావ అధ్యయనాలు పంచుకోకుండానే రివర్ ఫ్రంట్ ప్రాజెక్టును దూకుడుగా ప్రచారం చేయడాన్ని వారు తీవ్రంగా ఖండించారు. జమ్మూ, అహ్మదాబాద్, పూణేలో విఫలమైన రివర్ ఫ్రంట్ మోడళ్లను గుర్తుచేస్తూ, అక్కడ నది సుందరీకరించే పనులు కాలుష్యాన్ని, వరద ముప్పును మరింత పెంచాయని వారు హెచ్చరించారు.
● అనంతరం గత ఏడాది నుంచి సేవ్ మూసీ మూవ్‌మెంట్ సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం చేపడుతున్న మూసీ నది శుభ్రత, అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన ‘మూసీ క్లీనప్ డ్రైవ్’ చిత్రాలను విలేకరులకు ప్రదర్శించారు.
సేవ్ మూసీ మూవ్‌మెంట్ సంస్థ ఆరోపణ


