పేదల గుండె చప్పుడు ఆర్టీసీ
● రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్
● 65 నూతన ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం
బన్సీలాల్‌పేట్: తెలంగాణలో ఆర్టీసీ పేద ప్రజల గుండె చప్పుడు అని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సికింద్రాబాద్ రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో బుధవారం 65 నూతన ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ఎం.డి నాగిరెడ్డితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం రేవంత్‌రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వంలో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించి రెండేళ్లు పూర్తయ్యాయని చెప్పారు. ఢిల్లీలో నెలకొన్న వాయు కాలుష్య పరిస్థితి తెలంగాణలో తలెత్తకుండా ఈవీ పాలసీతో పాటు స్క్రాప్ పాలసీని తీసుకొచ్చినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. నగరంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఎక్కడెక్కడ బస్సులు అవసరమున్నాయో అనే విషయాన్ని ప్రజలు అధికారులకు, ప్రజాప్రతినిధులకు తెలపాలని సూచించారు. ప్రజలకు అవసరమున్న ప్రాంతాల్లో బస్సులు నడపడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజు ఆర్టీసీలో 60 లక్షల మంది ప్రయాణం చేస్తుంటే అందులో 40 లక్షల మంది మహిళా ప్రయాణికులేనన్నారు. ఇప్పటి వరకు 251 కోట్ల మంది మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేశారన్నారు. కొత్తగా 2400 బస్సులు వచ్చాయని.. 800కుపైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయని వివరించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో వచ్చే రెండేళ్లలో మొత్తం 2,800 కొత్త ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయని వెల్లడించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్ మోతె శ్రీలత, ఈవీ ట్రాన్స్ సీఈఓ సందీప్ రైజాడ, స్థానిక కార్పొరేటర్ సుచిత్రా శ్రీకాంత్, ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ పీవీ మునిశేఖర్, సీహెచ్ వెంకన్న, ఎం. రాజశేఖర్, రాణిగంజ్ డిపో మేనేజర్ ఎ. శ్రీధర్, సెంట్రల్ జోన్ డీసీపీ శిల్పవల్లి, నార్త్‌జోన్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే తదితరులు పాల్గొన్నారు.


