బలమైన సంస్థల నిర్మాణం ముఖ్యం
చేవెళ్ల: శాంతి, న్యాయం, సమగ్రత, పర్యావరణ బాధ్యత తదితర అంశాలే బలమైన సంస్థల నిర్మాణానికి మూలమని రాష్ట్ర ఉన్నత విద్యామండలి మాజీ చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, రాష్ట్రపతి కార్యాలయం మాజీ ఓఎస్‌డీ సత్యనారాయణసాహు అన్నారు. చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆర్థికశాస్త్రం విభాగం ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న భారతదేశం ఎస్‌డీజీ–16 రోడ్‌మ్యాప్ శాంతి, న్యాయం, బలమైన సంస్థలు అనే అంశంపై జాతీయ సెమినార్‌ను బుధవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడుతూ.. ప్రపంచ దేశాలు సుస్థిర అభివృద్ధి కోసం 17 లక్ష్యాలను ఏర్పాటు చేసుకున్నాయన్నారు. ఇందులో ఒకటి న్యాయం, శాంతి, బలమైన సంస్థల నిర్మాణాలు అన్నారు. దీని ప్రధాన ఉద్దేశం అన్ని స్థాయిల్లో స్వేచ్ఛ, సురక్షితంగా జీవించడానికి అవకాశం కల్పించడం, న్యాయ సమీకరణం, ప్రజాస్వామ్యం, స్వేచ్ఛాయుత సురక్షితమైన సమాజాలను నిర్మించటమే అన్నారు. దీనిపై చర్చించేందుకు నిపుణులు, విద్యావేత్తలు, పరిశోధకులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొనాలని తెలిపారు. అనంతరం 94 పరిశోధనా పత్రాలతో కూడిన ఐదు సంపాదిత గ్రంథాలను విడుదల చేశారు. ఈ సదస్సులో ప్రొఫెసర్లు ఎం.రాములు, కె.ముత్యంరెడ్డి, నరేందర్‌రెడ్డి, బి.నాగేశ్వరావు, శ్రీనివాస్, ఎం.గంగాధర్, అలీంఖాన్ ఫలాకీ, నర్సయ్య తదితరులు ఎస్‌డీజీ–16పై ప్రసంగించారు. కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ చీఫ్ మెంటర్ డాక్టర్ కాంచనలత, కన్వీనర్ డాక్టర్ మహ్మద్ అబ్దుల్ మాలిక్, అధ్యాపకులు కవిత, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
చేవెళ్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రారంభమైన సెమినార్


