నేడే తొలి సంగ్రామం
విధుల్లో నిర్లక్ష్యం వద్దు
సాక్షి, రంగారెడ్డిజిల్లా/షాద్‌నగర్: వారం రోజుల పాటు నువ్వా నేనా అనే రీతిలో పంచాయతీ ఎన్నికల ప్రచారంలో ప్రత్యర్థులు ఊగిపోయారు. అభ్యర్థులు గెలుపు కోసం ఎత్తుకు పైఎత్తులు వేస్తూ ఓటర్లు ఆకట్టుకునేందుకు ముమ్మరం ప్రయత్నం చేశారు. ఇంతలోనే ఎన్నికల ఘట్టం చివరి అంకానికి చేరుకుంది. గురువారం ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మధ్యాహ్న భోజన విరామం తర్వాత ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టి.. సాయంత్రం లోపు ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. తొలి విడతలో షాద్‌నగర్ డివిజన్‌లోని కొత్తూరు, నందిగామ, కేశంపేట్, కొందుర్గు, చౌదరిగూడ, ఫరూఖ్‌నగర్ మండలాలు, రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండల పరిధిలోని మొత్తం 174 సర్పంచ్ స్థానాలకు, 1,530 వార్డులకు నోటిఫికేషన్ జారీ అయింది. వీటిలో ఆరు సర్పంచ్ స్థానాలు సహా 190 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రస్తుతం 168 సర్పంచ్ స్థానాలకు 536 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. అలాగే 1,340 వార్డులకు 3,538 మంది పోటీలో ఉన్నారు. మొత్తం 2,35,506 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
సమస్యాత్మక కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్
తొలి విడత ఎన్నికల్లో భాగంగా 42 సమస్యాత్మాక కేంద్రాలను గుర్తించి, వాటిలో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు చేశారు. నిఘా కోసం 32 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించారు. ఇక ఎన్నికల నిర్వహణ కోసం 1,989 పోలింగ్ ఆఫీసర్లు, 2,314 మంది అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లను వినియోగిస్తున్నారు. వీరితో పాటు 55 మంది జోనల్ ఆఫీసర్లను, 21 మంది ఎఫ్‌ఎస్‌టీలు, 21 మంది ఎస్‌ఎస్‌టీలు, ఎంసీసీ, వ్యయ బృందాలను కూడా నియమించారు. 2,100 బ్యాలెట్ బాక్సులను పంపిణీ చేశారు. సిబ్బందిని 62 బస్సుల్లో ఆయా పోలింగ్ స్టేషన్లకు పంపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా షాద్‌నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. కేంద్రానికి 120 మీటర్ల దూరం నుంచే ఆంక్షలు అమలు చేయనున్నారు. షాద్‌నగర్ డివిజన్ పరిధిలో ఐదుగురు ఏసీపీలు, 16 మంది సీఐలు, 54 మంది ఎస్‌ఐలు, 150 మంది హెడ్‌కానిస్టేబుళ్లు, 800 మంది కానిస్టేబుళ్లతో పాటు ఏఆర్ పోలీసులు ఎన్నికల బందోబస్తులో విధులు నిర్వహించనున్నారు. రాజేంద్రనగర్ డివిజన్ పరిధిలోని శంషాబాద్ మండలంలో అడిషనల్ డీసీపీ పూర్ణచందర్ నేతృత్వంలో ఇద్దరు ఏసీపీలు, పది మంది సీఐలు, 30 మంది ఎస్‌ఐలు, 500 మందికి పైగా పోలీసులతో గ్రామాల్లో బందోబస్తు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న సిబ్బంది అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని, ఏమాత్రం ఏమర పాటుగా వ్యవహరించినా ఇబ్బందులు తప్పవని జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి హెచ్చరించారు. బుధవారం శంషాబాద్ జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలని సూచించారు. బ్యాలెట్ పత్రాలు సహా బాక్సులను పరిశీలించారు. ఏవైనా లోపాలు దృష్టికి వస్తే వెంటనే సంబంధిత అధికారితో మాట్లాడి సమస్య లేకుండా చూడాలన్నారు. డిస్ట్రిబ్యూషన్ కేంద్రం నుంచి పోలింగ్ కేంద్రానికి చేరుకున్న తర్వాత ఎన్నికల ఏర్పాట్లను మరోసారి పరీశీలించాలని కోరారు. తాగునీరు, లైటింగ్, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో రాజేంద్రనగర్ ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, శంషాబాద్ తహసీల్దార్ రవీందర్, ఎంపీడీఓ మున్సి తదితరులు పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలిసి రాజేంద్రనగర్‌లోని ఈవీఎం గోడౌన్‌ను సందర్శించారు.
పంచాయతీ ఎన్నికల మొదటి విడత పోలింగ్
సాయంత్రంలోపే ఫలితాల విడుదల
గ్రామాల్లో పోలీసుల పటిష్ట బందోబస్తు
168 సర్పంచ్, 1340 వార్డు స్థానాలకు పోటీ
విధుల్లో నాలుగు వేల మంది సిబ్బంది
ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ నారాయణరెడ్డి
నేడే తొలి సంగ్రామం


