మహా ప్రగతికి పరుగులు
● సమగ్ర రవాణా అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు
● తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో హెచ్‌ఎండీఏ కార్యాచరణ
గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు, భారీ టౌన్‌షిప్‌లు
సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ రైజింగ్ సమ్మిట్ వేదికగా హైదరాబాద్ మహానగర భవిష్యత్ అభివృద్ధిపై హెచ్‌ఎండీఏ కార్యాచరణ ప్రకటించింది. రీజినల్ రింగ్‌రోడ్డు వరకు మహానగరం పరిధిని విస్తరించిన దృష్ట్యా ఇందుకు తగిన విధంగా మహానగర విస్తరణ, అభివృద్ధి ప్రణాళికలను హెచ్‌ఎండీఏ ఆవిష్కరించింది. ఇప్పటికే వివిధ దశల్లో ఉన్న సమగ్రాభివృద్ధి ప్రణాళికలను కేంద్రంగా చేసుకొని హైదరాబాద్ భవిష్యత్ లక్ష్యాలను స్పష్టం చేసింది. ఈ మేరకు రహదారుల విస్తరణ, గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్లు, భారీటౌన్‌షిప్‌ల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు తెలంగాణ రైజింగ్ సమ్మిట్‌లో ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈమేరకు భవిష్యత్ దార్శనికతను ప్రతిబింబించేలా హెచ్‌ఎండీఏ, మెట్రోరైల్ లోగోలను సైతం ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఔటర్‌రింగ్ రోడ్డు వరకు జీహెచ్‌ఎంసీ పరిధిని పెంచిన దృష్ట్యా ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు చేపట్టనున్న కార్యకలాపాలను సమ్మిట్‌లో వివరించారు.
ట్రిపుల్ ఆర్ వరకు టౌన్‌షిప్‌లు..
తెలంగాణ కోర్ అర్బన్ ప్రాంతం పరిధిలో ఔటర్ నుంచి ట్రిపుల్‌ఆర్ వరకు భారీ టౌన్‌షిప్‌లను నిర్మించనున్నారు. ఇందుకోసం అవసరమైన భూసేకరణ, లే అవుట్‌ల అభివృద్ధికి హెచ్‌ఎండీఏ చర్యలు చేపట్టనుంది. ఇప్పటికే వివిధ ప్రాంతాల్లో టౌన్‌షిప్‌ల నిర్మాణంపై దృష్టి సారించినట్లు అధికారులు తెలిపారు. మరోవైపు 2047 నాటికి రీజినల్ రింగ్‌రోడ్డు చుట్టూ సుమారు 3.5 లక్షల ఇళ్లను నిర్మించి ప్రతి ఒక్కరికీ గృహ వసతి కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రభుత్వం ఈ వేదిక నుంచి స్పష్టం చేసింది. అలాగే లాజిస్టిక్ హబ్‌లు, ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేయనున్నారు. హైదరాబాద్ ఎకనామికల్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో భాగంగా సుమారు 30 ఆర్థిక మండలాల ఏర్పాటుపై హెచ్‌ఎండీఏ దృష్టి సారించింది. మరోవైపు గ్రీన్ బ్లూ డెవలప్‌మెంట్ ప్రణాళికలో భాగంగా మూసీ ప్రక్షాళన, పడమటి వైపు నుంచి తూర్పున మూసీ చివరి వరకు రహదారుల విస్తరణ. చెరువులు, ఇతర జలవనరుల సంరక్షణ, పచ్చదనం, పర్యావరణాభివృద్ధి కార్యక్రమాలను సైతం బ్లూగ్రీన్ డెవలప్‌మెంట్ ప్లాన్‌లో హెచ్‌ఎండీఏ ప్రస్తావించింది.
సమగ్ర పట్టణ రవాణా ప్రజా రవాణా ప్రణాళిక (కాంప్రహెన్సివ్ మొబిలిటీ ప్లాన్)లో భాగంగా రహదారులు, రవాణా సదుపాయాల అభివృద్ధి లక్ష్యాలను వివరించారు. ప్రస్తుతం ఔటర్ నుంచి ట్రిఫుల్ ఆర్ వరకు కనెక్టివిటీని కల్పిస్తూ.. రావిర్యాల– ఆమన్‌గల్ గ్రీన్‌ఫీల్డ్ రేడియల్ రోడ్డు తరహాలో వివిధ ప్రాంతాల్లో మరో 18 రోడ్లను నిర్మించాలని ప్రతిపాదించారు. దీంతో నగరానికి అన్ని వైపులా ఔటర్ నుంచి ట్రిపుల్ ఆర్ వరకు కనెక్టివిటీ అందుబాటులోకి వస్తుంది. ఇందులో భాగంగానే శంషాబాద్ కొత్వాల్‌గూడ నుంచి పరిగి సమీపంలోని చిట్యాల వరకు రెండో గ్రీన్‌ఫీల్డ్ రోడ్డు నిర్మాణానికి హెచ్‌ఎండీఏ రైతుల నుంచి భూసేకరణ చేపట్టింది. హైదరాబాద్ మహా నగరాన్ని 7250 చ.కి.మీ నుంచి సుమారు 10,050 చ.కి.మీ వరకు పెంచిన దృష్ట్యా అందుకు అనుగుణంగా వచ్చే 2047 నాటికి మాస్టర్‌ప్లాన్ రూపకల్పనకు హెచ్‌ఎండీఏ కసరత్తు చేస్తోంది.


