గూడు చెదిరె.. గోడు మిగిలె!
● సరూర్‌నగర్‌లో మూతపడిన నైట్ షెల్టర్
● రోడ్డున పడిన ఒంటరి, వృద్ధ మహిళలు
● అధికారుల నిర్ణయంతో ఇబ్బందులు
హుడాకాంప్లెక్స్: గూడు చెదిరిన పక్షుల్లా అనాథ, ఒంటరి మహిళలు చెల్లా చెదురయ్యారు. అప్పటివరకు ఒకే గొడుగు కింద ఉన్న ఆయా మహిళలంతా.. ప్రభుత్వ నిర్ణయంతో మళ్లీ రోడ్డున పడ్డారు. ఏళ్లుగా అనాథ మహిళలకు ఆశ్రయం కల్పించిన సరూర్‌నగర్ చౌడిలోని నైట్‌షెల్టర్ అధికారుల అనాలోచిత నిర్ణయంతో నేడు మూతపడింది. అప్పటివరకు అక్కడ వసతి పొందిన 22 మంది మహిళలు చెట్టుకొక్కరు.. పుట్టకొక్కరు అన్నట్లుగా వెళ్లిపోయారు.
12 ఏళ్లుగా సేవలు
అనాథ, ఒంటరి మహిళలకు ఆశ్రయం కల్పించాలనే ఉద్దేశంతో 2013లో అప్పటి ప్రభుత్వం చౌడిలోని ఓ భవనంలో నైట్ షెల్టర్ ఏర్పాటు చేసింది. చలికి వణుకుతూ, ఎండకు ఎండుతూ ఏ దిక్కు లేని వాళ్లకు ఆశ్రయం కల్పించి.. మూడు పూటలా భోజనం కూడా పెట్టేది. ముఖ్యంగా పిల్లలు వదిలేసిన వృద్ధ మహిళలు ఎక్కువగా ఉండేవారు. భర్త చనిపోయిన అతివలు కూడా ఇక్కడే ఉంటూ పగటి పూట పనులు చేసుకుని, రాత్రి వేళ ఆశ్రయం పొందేవారు. ప్రస్తుతం ఈ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఖాళీ చేయించారు. ప్రత్యామ్నాయంగా మరో భవనం కేటాయించకపోవడంతో అప్పటివరకు దీన్నే నమ్ముకున్న వాళ్లు మళ్లీ అనాథలయ్యారు. వీరిలో ఇద్దరు మహిళలకు ఓ స్వచ్ఛంద సంస్థ ఆశ్రయం కల్పిస్తుండగా, మిగిలిన వారంతా పార్కులు, ఫుట్‌పాత్‌లపై జీవనం సాగిస్తున్నారు. పట్టెడు అన్నం కోసం పడరాని పాట్లు పడుతున్నారు.


