చీకటి కోణం.. ఓటుకు బాణం! | - | Sakshi
Sakshi News home page

చీకటి కోణం.. ఓటుకు బాణం!

Dec 10 2025 9:21 AM | Updated on Dec 10 2025 9:21 AM

చీకటి కోణం.. ఓటుకు బాణం!

చీకటి కోణం.. ఓటుకు బాణం!

పగలు ప్రచార పథం

రాత్రిళ్లు ప్రలోభాల పర్వం

గెలుపే అభ్యర్థుల లక్ష్యం

షాద్‌నగర్‌: గెలుపువేటలో అభ్యర్థులు అన్ని అస్త్రశస్త్రాలు ప్రయోగిస్తున్నారు. ఓటర్లను మచ్చిక చేసుకునేందుకు ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. పొద్దంతా ప్రచారం సాగించి.. పొద్దుగుంకితే చాలు మందు, విందులతో ముంచేస్తున్నారు. పోలీసులు ఎంతా నిఘా పెట్టినప్పటికీ.. అధికారులు నిబంధనల కొరడా ఝలిపిస్తున్నప్పటికీ డబ్బుల పంపిణీ.. మద్యం సీసాల గలగలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. గెలవాలంటే ఇదే ప్రధానమని బాహాటంగానే చెబుతున్నారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల ప్రచారం పర్వం ముగియడంతో ప్రలోభాలకు తెరలేపారు. పోలింగ్‌కు ఒక్క రోజే మిగిలి ఉన్న నేపథ్యంలో పూర్తిగా దీనిపైనే దృష్టి సారించారు.

గ్రూపులుగా ఏర్పడి..

అడ్డాలు ఏర్పాటు చేసుకుని..

ఎన్నికల ఆరంభం నుంచే ప్రచారంలో జనాలను తమ చుట్టూ తిప్పుకొనేందుకు అభ్యర్థులు రోజువారీగా వారికి డబ్బులు చెల్లిస్తున్నారు. బిర్యానీ ప్యాకెట్లు, మద్యం సీసాలు అదనం. ఇక తాజాగా రాత్రి వేళల్లో ఇళ్లకు వెళ్లి నగదు సమర్పణలు షురూ చేశారు. పరిశ్రమలు ఉన్న గ్రామాలు, స్థిరాస్తి వ్యాపారులు ఉన్న గ్రామాల్లో ప్రలోభాల పర్వం రసవత్తరంగా సాగుతోంది. పగలంతా సాధారణంగా ప్రచారంలో కనిపించే నాయకులు రాత్రి అయ్యే సరికి అడ్డాలు ఏర్పాటు చేసుకొని గ్రూపులుగా ఏర్పడి డబ్బుల పంపిణీ చేస్తున్నారు.

దొడ్డిదారుల్లో మద్యం తరలింపు

సాధారణంగా మద్యం దుకాణాల వద్ద సివిల్‌ దుస్తుల్లో పోలీసులు నిఘా వేసి ఉంచారు.. పెద్ద ఎత్తున మద్యం తరిలితే అది ఎక్కడికి చేరుతుందో తెలుసుకొని పట్టుకోవడం వారి బాద్యత. గ్రామాల్లో కూడా ప్రత్యేక నిఘా బృందాలు ఏర్పాటు చేశారు. అయినప్పటికీ దొడ్డిదారుల్లో పెద్ద ఎత్తున గ్రామాలకు మద్యం తరలిస్తున్నారు. మద్యం ప్రియులను ఖుషీ చేసి ఎన్నికల రోజు వరకు ఓటును కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. కొంత మంది ముందుగానే వైన్‌షాప్‌లతో మాట్లాడుకొని చిట్టీల రూపంలో నేరుగా ఓటర్లను దుకాణాలకు పంపిస్తున్నారు. అధికారులు ఎన్ని కట్టుదిట్టమైన చర్యలు చేపట్టినా ఇప్పటిదాకా ఎక్కడా పెద్ద ఎత్తున మద్యం పట్టుకున్న దాఖలు, డబ్బులు దొరికిన దాఖలాలు గానీ లేవు. అభ్యర్థుల ఆట ముందు పోలీసుల మద్యం, డబ్బుల వేట చిన్నబోతోంది.

తీపి ‘గుర్తు’గా కానుకలు

మద్యం, డబ్బులు మాత్రమే కాదు. కొంత మంది అభ్యర్థులు తమ గుర్తులు అని కానుకలుగా ఇస్తూ ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. వెండి ఆభరణాలను పంపిణీ చేస్తున్నారు. హ్యాండ్‌ బ్యాగు, ఫుట్‌ బాల్‌, బ్యాట్‌, కత్తెర, గౌను తదితర గుర్తులు వచ్చిన అభ్యర్థులు ఇంటింటికీ వెళ్లి గుర్తులను కానుకలుగా ఇస్తున్నారు. దీని ద్వారా ఓటు వేసేటప్పుడు తమ గుర్తు వారికి బాగా గుర్తుండిపోతుందని నమ్ముతున్నారు. మొదటి విడత ఎన్నికలకు ఒక్కరోజే మిగిలి ఉండడంతో చీకటి పంపకాల మీదే అభ్యర్థులు పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. పోలీసులు దీన్ని ఎలా ఎదుర్కొంటారో చూడాలి మరి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement